
LPG Cylinder Price Hike: మరోసారి దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ఒక్కో యూనిట్ కు రూ. 350.50, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను ఒక్క యూనిట్ కు రూ.50 పెంచాయి. ఎల్పీజీ ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని సిద్దిపేట పట్టణ మహిళా నాయకులు డిమాండ్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. కేంద్రం మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.50 పెంచడంతో సిద్దిపేట పట్టణంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. సిలిండర్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఉపసంహరించుకోవాలని సిద్దిపేట పట్టణ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని రద్దీగా ఉండే రహదారిపై కట్టెలపై వంట చేస్తూ మహిళలు తమ నిరసనను తెలియజేశారు. ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు సామాన్యులకు భారంగా మారిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు.
దేశంలో ఆకాశాన్నంటుతున్న అన్ని నిత్యావసర వస్తువుల ధరలను కేంద్రం నియంత్రించాలనీ, ధరలను తగ్గించడంలో విఫలమైతే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు.
కాగా, సామాన్యులపై భారం మోపుతూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా రూ. 350 రూపాయల పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.50 పెరిగాయి. 12.2 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర ఇప్పుడు 1155 కు చేరుకుంది. నేడు పెరిగిన రేట్ల ప్రకారం చూస్తే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1103కు చేరుకుంది. ముంబైలో పెరిగిన రేట్లతో కలిపి రూ.1102కు చేరింది. కోలకత్తాలో రూ.1129, చెన్నైలో రూ.1118కి చేరుకున్నాయి. ఈ పెరిగిన రేట్లతో చూస్తే తెలుగు రాష్ట్రాలలో సిలిండర్ ధర 50 రూపాయలు పెరగడంతో మొత్తంగా రూ.1155కు చేరింది. గత ఎనిమిది నెలల నుంచి సిలిండర్ ధర తెలుగు రాష్ట్రాల్లో పెరగలేదు. హైదరాబాదులో గ్యాస్ సిలిండర్ ధర రూ.1155 కాగా.. ఆంధ్ర ప్రదేశ్ లో 50 రూపాయలు పెరగడంతో సిలిండర్ ధర రూ.1161కి చేరింది.