
స్వయంగా సుప్రీం కోర్టు కలగజేసుకున్న తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే భవితవ్యం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడం లేదు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై వేటు వేయాలి. అయితే స్పీకర్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి చర్యలు తీసేకోలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారం రాజ్యాంగరిత్యా కేవలం స్పీకర్ కు మాత్రమే ఉంది. స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించాకే దానిపై అంతిమంగా స్పందించే అధికారం కోర్టులు కలిగి ఉంటాయి. దీంతో చాలా సందర్భాల్లో అధికార పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేపై ఏ స్పీకర్ కూడా సరిగ్గా చర్యలు తీసుకోలేదు.
ప్రస్తుతం టీఆర్ఎస్ లోకి వచ్చిన వివిధ పార్టీల ఎమ్మేల్యేపై వేటు వేయకుండా స్పీకర్ మధుసూదనాచారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయి. సుప్రీం కోర్టు ఈ చర్యపై కాస్త ఘాటుగానే స్పందించడంతో ఎట్టకేలకు స్పీకర్ స్పందించారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కు సంబంధించి ‘త్వరలో నిర్ణయం తీసుకుంటాం’ అని సుప్రీం కోర్టుకు స్పీకర్ మధుసూదనాచారి తెలపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సంబంధిత ప్రక్రియ కొనసాగుతోందని వివరించనున్నట్లు సమాచారం. ఇందుకు నిదర్శనంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిసింది. అయితే..సుప్రీం ఎదుట ఇవ్వబోయే ఈ సమాధానాన్ని కూడా లిఖిత పూర్వకంగా కాకుండా అడ్వకేట్ జనరల్‌తో నోటి మాట ద్వారా చెప్పించనున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎ్‌సలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని స్పీకర్‌ను సుప్రీం అడిగిన విషయం తెలిసిందే. ఈనెల ఎనిమిదో తేదీలోగా నిర్ణయం చెప్పాలని స్పీకర్‌కు గడువు విధించింది. మంగళవారంతో ఈ గడువు పూర్తికానుంది. షెడ్యూల్ ప్రకారం కేసు మంగళవారం విచారణకు వస్తే ‘ ఇంకా విచారిస్తున్నాం.. త్వరలో నిర్ణయం’ అన్న అభిప్రాయాన్నే చెప్పబోతున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా, అనర్హత నిర్ణయం తీసుకోవటంలో జాప్యమెందుకని సుప్రీం ప్రశ్నిస్తే.. స్పీకర్‌గా అసెంబ్లీ వ్యవహారాలు, ఇతర అధికారిక కార్యక్రమాలు పర్యవేక్షించటంతోపాటు ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందునే జాప్యం జరుగుతోందని వివరిస్తారట. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు అప్పటి స్పీకర్ సురేశ్ రెడ్డికి నాలుగేళ్లు పట్టిందని ఏజీ గుర్తు చేసినట్లు సమాచారం.