
తెలంగాణలో నేడు (ఫిబ్రవరి 1) విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం నేటి నుంచి పున:ప్రారంభించింది. విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధలను కఠినంగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యాసంస్థల్లో శానిటైజర్లు, మాస్క్‌లతో పాటు అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే పాఠశాలలను శానిటైజేషన్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దాదాపు 24 రోజుల సెలవుల తర్వాత తెలంగాణలో స్కూల్స్, కాలేజ్‌లు తెరుచుకోవడం.. విద్యార్థులు బడి బాట పట్టారు.
ఇక, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 8 నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాటికి సంక్రాంతి సెలవులు కలుపుకుని 16వ తేదీ వరకు సెలవులను నిర్ణయించారు. ఆ తర్వాత సెలవులను జనవరి 30 వరకు పొడిగించారు. ఈ క్రమంలోనే 8 నుంచి పైతరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు టీ శాట్, దూరదర్శన్, వాట్సప్ తో ఆన్ లైన్ బోధన జరిగింది. ఇక, తాజాగా సెలవును మరో రోజు పొడిగించిన విద్యాశాఖ.. పాఠశాలలను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది.
ఓయూలో కూడా నేటి నుంచే ప్రత్యక్ష తరగతులు..
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్(undergraduate), పోస్ట్ గ్రాడ్యుయేట్ (postgraduate) కోర్సుల సెమిస్టర్లన్నింటికీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై గందరగోళం చోటుచేసుకుంది. తొలుత ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులను కొనసాగించనున్నట్టుగా యూనివర్సిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో సోమవారం ఓయూలో యూనివర్సిటీ క్యాంపస్ ప్రిన్సిపల్స్, యూనివర్సిటీలోని ఇతర అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘హైదరాబాద్‌లో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల యొక్క ప్రస్తుత సెమిస్టర్‌లన్నింటికీ OU ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులను కొనసాగిస్తుంది’ అని అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఓయూ అధికారులు వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని యూజీ, పీజీ కాలేజ్‌ల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు జరుగుతాయని సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఓయూ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులందరూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని అధికారులు సూచించారు.