కరోనా ఎఫెక్ట్.. 50శాతం పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు

By telugu news teamFirst Published May 12, 2020, 10:58 AM IST
Highlights

ఆర్టీసీ బస్సులు నడిపితే బస్సు కెపాసిటీలో 50శాతం మందిని మాత్రమే ఎక్కించుకోవాలని కేంద్రం ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు బస్సు ఛార్జీలు పెంచాలని భావిస్తున్నారు.
 

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. మరి కొద్ది రోజుల్లో ఈ లాక్ డౌన్ ని ఎత్తివేయనున్నారు. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం.. త్వరలోనే బస్సు ప్రయాణాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

అయితే.. బస్సులు తిరుగుతాయి అని ప్రజలు ఆనందపడేలోపే.. మరో వార్త భయపెడుతోంది. లాక్ డౌన్ తర్వాత బస్సు ప్రయాణం ప్రజలకు భారం కానుంది. తెలంగాణలో బస్సు ఛార్జీలను పెంచాలని టీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. బస్సులు ఎప్పుడు నడిపినా 50శాతం ధరలు పెంచాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఛార్జీల పెంపుపై ఇప్పటికే సంబంధిత అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సులు నడిపితే బస్సు కెపాసిటీలో 50శాతం మందిని మాత్రమే ఎక్కించుకోవాలని కేంద్రం ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు బస్సు ఛార్జీలు పెంచాలని భావిస్తున్నారు.

అలా పెంచకపోతే... ఆర్టీసీకి అదనపు భారం పడే అవకాశం ఉంది. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఇలా ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కూర్చునే సీటులో ఒకరు ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా బస్సు ఎక్కేటప్పుడు ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బస్సులను శానిటైజ్ చేసి సిద్ధంగా ఉంచారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తెలంగాణ ఆర్టీసీకి రూ.26కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు  చెబుతున్నారు.

ఆర్టీసీ నష్టాన్ని తగ్గించుకోవడానికే చార్జీలు పెంపు నిర్ణయాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం. దసరా పండగ సీజన్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో సుమారు రెండు నెలలు బస్సులు పెద్దగా నడవకపోవడంతో అంతే స్థాయిలో ఇన్‌కమ్‌ పోయింది. ఒక బస్సులో 56 సీట్లున్నాయి. అంటే 23 మందినే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. 

మామూలు సమయంలోనూ ఆర్టీసీకి నష్టాలు వచ్చేవి. ఇప్పుడు 50 శాతంతో నడిపితే సంస్థ భవిష్యత్‌ ఎలా అని అధికారులు వాపోతున్నారు. నష్టాన్ని పూడ్చుకునేందుకు చార్జీలు పెంచక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.

click me!