లాభాలు రాకుంటే 4 నెలల్లో ఆర్టీసీ ప్రైవేట్ పరమే.. కేసీఆర్ ఇదే చెప్పారు: బాజీరెడ్డి గోవర్థన్ సంచలనం

By Siva KodatiFirst Published Sep 22, 2021, 8:48 PM IST
Highlights

టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజీరెడ్డి గోవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గోవర్థన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు బాజీరెడ్డి.

టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజీరెడ్డి గోవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గోవర్థన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు బాజీరెడ్డి.

రెండ్రోజుల క్రితమే ఆర్టీసీ  చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ రివ్యూలో పాల్గొన్నారు. ఆర్టీసీ బలోపేతానికి సీఎం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, ఆయన అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారని చెప్పారు. లాభాలు తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని, నష్టాలోస్తే కార్మికులు, అధికారులు అందరూ రోడ్డున పడతారని కొత్త చైర్మన్ బాజిరెడ్డి హెచ్చరించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు, అధికారులు సక్కగా పనిచేసుకోవాలని చెప్పారు.

Also Read:టీఆర్ఎస్‌లో పదవుల జోష్: టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం

కాగా, కాగా, తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతో పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న అటు ఆర్టీసీ, ఇటు విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ దీనిపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా శాఖలకు తెలిపారు సీఎం కేసీఆర్‌. కరోనా సంక్షోభంతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం హైదరాబాద్‌లోనే నెలకు 90 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని సీఎంకు తెలిపారు అధికారులు. తెలంగాణలోని మొత్తం 97 డిపోలు నష్టాల్లోనే నడుస్తున్నాయ్‌. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు అధికారులు.

click me!