తెలంగాణలో కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా కరోనా మహ్మమరి వ్యాప్తి జరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు 21 నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా టెస్టులు పెంచాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా ఆరు కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 14 మంది పేషెంట్లు ఐసోలేషన్‌లో ఉన్నారు. వీళ్లంతా మైల్డ్ సింప్టమ్స్‌తోనే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.ఈ కేసులన్నీ హైదరాబాద్ నగర పరిధిలోనే నమోదు కావడం ఆందోళనకరం.
మంత్రి రాజనర్సింహా సమీక్ష :
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహా వైద్య ఆరోగ్య శాఖ(Health Minister) వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కొవిడ్ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా.. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా విజ్రుంభన నేపథ్యంలో వైద్యులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ నేపథ్యంలో గురువారం అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ల్ పూర్తి చేయాలని, ఆసుపత్రులు అవసరమైన వనరులను టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు, ఉస్మానియా(Osmania) సూపరిండెంట్ నాగేంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.