Prajavani : ప్రజాదర్బార్‌ ఇకపై ప్రజావాణి.. ఆ రెండు రోజుల్లో నిర్వహించాలని సీఎం ఆదేశం..

By Rajesh Karampoori  |  First Published Dec 12, 2023, 5:59 AM IST

Prajavani : ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రజా దర్బార్‌ను ఇకపై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. వారంలో రెండు రోజులు.. ప్రతి మంగళ, శుక్రవారం నిర్వహించనున్నట్టు  తెలిపారు. 


Prajavani :ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రజలకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రజా దర్బార్‌ను ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇక వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ నెల 8న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజాభవన్‌కు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వరకు వినతి పత్రాలందాయి.ఇందులో ఎక్కువ శాతం రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతి పత్రాలే ఎక్కువ ఉన్నాయని  అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందాయని అధికారులు ప్రకటించారు.

Latest Videos

click me!