ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ తరపున పురుమళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 రోజులే సమయం వుండటంతో ప్రధాన పార్టీలు గెలిచేందుకు వున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రభావం చూపే అన్ని వర్గాలను నేతలు మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కీలక నేతలు బరిలో దిగిన స్థానాలను ఓటర్లు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఇందులో ఒకటి కరీంనగర్. ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. బండికి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కూడా బలమైన నేతలను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ తరపున పురుమళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
ప్రతి నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపొటములను ఓ వర్గం శాసిస్తున్నట్లే కరీంనగర్‌లోనూ .. అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించేది రెండు వర్గాలు. ఒకరు మున్నూరు కాపులైతే.. రెండోది ముస్లింలు. తొలుత ఈ ప్రాంతంలో వెలమ సామాజిక వర్గం బలంగా వున్నప్పటికీ.. రాను రాను ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం పుంజుకుంది. కరీంనగర్‌లో మొత్తం ఓటర్లు 3,40,520 మంది. వీరిలో మున్నూరు కాపులు 60,892.. ముస్లింలు 68,952.. వెలమలు 39,785.. రెడ్లు 21,985 మంది ఓటర్లున్నారు.
undefined
బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఇక్కడ చెమటలు పట్టిస్తున్నారు. గతంలో వరుసగా మూడు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంజయ్‌పై సానుభూతి ఎక్కువగా వుందని చెబుతారు. అంతేకాదు.. బీజేపీలో సీఎం అభ్యర్ధి ఆయనేనని మద్ధతుదారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ఆయన ప్రభుత్వంపై వాడి వేడి విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాలు, గ్రూప్ పరీక్షా పేపర్ల లీకేజ్, యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారంటూ బండి సంజయ్ దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి తోడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కనీసం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
ఇకపోతే.. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ నాలుగో సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు గెలిచిన హ్యాట్రిక్ కొట్టిన గంగుల.. నాలుగోసారి విజయం సాధించాలని భావిస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్, మెడికల్ కాలేజ్, టీటీడీ దేవాలయం, ఇస్కాన్ టెంపుల్ వంటివి పూర్తి చేయడంలో తాను కీలకపాత్ర పోషించానని మంత్రి చెబుతున్నారు. ఎంపీగా వున్నప్పటికీ బండి సంజయ్ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయలేదని గంగుల ఆరోపిస్తున్నారు.
చివరిగా కాంగ్రెస్ అభ్యర్ధి పురుమళ్ల శ్రీనివాస్ విషయానికి వస్తే.. కరీంనగర్ రూరల్ మండలం జెడ్పీటీసీగా వున్న ఆయన అసెంబ్లీ బరిలో నిలిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇమేజ్‌తో పాటు బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు తనను గెలిపిస్తాయని నమ్మకంగా వున్నారు. జెడ్పీటీసీగా, సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో చేసిన సేవలను ఆయన గుర్తుచేస్తున్నారు. మున్నూరు కాపు, ముస్లిం ఓటర్లు తనకు అండగా నిలబడతారని ఆయన భావిస్తున్నారు.