లక్ష్యం 2019 లోకసభ ఎన్నికలు: తెలంగాణలో చంద్రబాబు త్యాగం

Published : Oct 23, 2018, 01:29 PM IST
లక్ష్యం 2019 లోకసభ ఎన్నికలు: తెలంగాణలో చంద్రబాబు త్యాగం

సారాంశం

తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి ప్రజా కూటమిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధపడాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు తెలంగాణ నేతలకు చెప్పారు.

హైదరాబాద్: వచ్చే పార్లమెంటు ఎన్నకల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో త్యాగం చేయడానికి పూనుకున్నారు. తెలంగాణలో ఏర్పడిన ప్రజా కూటమి జాతీయ రాజకీయాలకు దారి చూపగలదని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఏర్పడే కూటమి విజయానికి తెలంగాణ శాసనసభ ఎన్నికలు పునాదిగా పనికి వస్తాయని భావిస్తున్నారు. 

తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి ప్రజా కూటమిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధపడాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు తెలంగాణ నేతలకు చెప్పారు. ప్రజా కూటమి విజయమే మనకు ముఖ్యమని ఆయన పార్టీ తెలంగాణ నేతలకు చెప్పారు. 

గెలిచే సీట్లను మాత్రమే తీసుకుందామని, తద్వారా తెలంగాణలో ప్రజా కూటమి విజయానికి దోహదం చేద్దామని ఆయన చెప్పారు. తెలంగాణలో 18 శాసనసభ స్థానాలతో సరిపెట్టుకుందామని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో ప్రజా కూటమి విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో కూటమికి సానుకూల పవనాలు వీస్తాయని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. 

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెసుతో కలిసి జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపియేతర పక్షాల నేతలతో జనవరిలో కోల్ కతాలో భారీ ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీకి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. 

తెలంగాణలో కాంగ్రెసు, టీడీపి, సిపిఐ, తెలంగాణ జన సమితిలతో ఏర్పడిన ప్రజా కూటమి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే రీతిలో పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందువల్ల 2019 ఎన్నికల కోసం శాసనసభ సీట్లను త్యాగం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్