గవర్నర్ తో టీ- కాంగ్రెస్ నేతల భేటీ: వీహెచ్, పొన్నాలకు అవమానం

By Nagaraju penumalaFirst Published Dec 7, 2019, 3:53 PM IST
Highlights

తమిళసైని కలిసేందుకు మాజీ పీసీసీ చీఫ్ లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలు సైతం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అయితే రాజ్ భవన్ కు చేరుకున్న వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను రాజ్ భవన్ సిబ్బంది అడ్డుకున్నారు.  

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మహా సముద్రంలాంటిదని అందులో అలలు అలకలు సహజమేనంటూ నానుడి ఉంది. కాంగ్రెస్ లో ఎన్నో రాజకీయాలు జరుగుతూ ఉంటాయని ఆ పార్టీ నేతలు చెప్తూ ఉంటారు. 

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అంటూ ప్రచారం కూడా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంతంగా ఎవరు పడితే వారు విచ్చలవిడిగా కామెంట్లు చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. అందుకే గ్రూప్ రాజకీయాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇలాంటి ఘటనే తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంది. రాజ్ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపించాయి. రాజభవన్ వేదికగా ఇద్దరు పీసీసీ చీఫ్ లకు ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాలపై గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు ఫిర్యాదు చేయాలని సీఎల్పీ తీర్మానించింది. 

శుక్రవారం సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం గవర్నర్ ను కలవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళసైని కలిశారు. అయితే తమిళసైని కలిసేందుకు మాజీ పీసీసీ చీఫ్ లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలు సైతం రాజ్ భవన్ కు చేరుకున్నారు. 

అయితే రాజ్ భవన్ కు చేరుకున్న వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను రాజ్ భవన్ సిబ్బంది అడ్డుకున్నారు. గవర్నర్ ను కలిసేవారి జాబితాలో మీ పేర్లు లేవంటూ చెప్పుకొచ్చారు. దాంతో గవర్నర్ ను కలవకుండానే వెనుతిరగాల్సి వచ్చింది పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావులు. 

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అయిన తమకు ఘోర అవమానం జరిగిందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన జాబితాలో తమ పేర్లు లేకపోవడం బాధాకరమన్నారు. 

బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమకు అవమానకరమన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఫోన్ చేస్తేనే వచ్చామని తీరా చూస్తే జాబితాలో తమ పేర్లు లేకపోవడం అవమానకరంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, మద్యం నియంత్రణ, బెల్టు షాపుల రద్దు వంటి అంశాలపై గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు ఫిర్యాదు చేశారు. సకల నేరాలకు కారణమైన మద్యాన్ని నియంత్రించాలని గవర్నర్ సౌందర్ రాజన్ కు ఫిర్యాదు చేసినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్టు  షాపులను తొలగించాలని గవర్నర్ సౌందర్ రాజన్ ను కోరినట్లు తెలిపారు. 

నేరాలు, మహిళలపై దాడులను నియంత్రించాలి డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలను తగ్గించాలని, పోలీసులను ప్రజల భద్రత కోసం వినియోగించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ నేతల కోసమే వినియోగిస్తున్నారని ఆరోపించారు. దిశ కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని భట్టి విక్రమార్క ఆరోపించారు. 

click me!