
తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా వారి వారి వ్యుహాలను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా యువతను టార్గెట్ చేయడంపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఏడాది ఉద్యోగాల భర్తీ చేపడితే.. విపక్ష పార్టీలు అధికారంలోకి రాగానే భారీగా ఉద్యోగాల భర్తీ చేపడతామని యువతను ఆకర్షించేందుకు హామీలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో యువత ఓటు పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుందనే భావనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే.. తెలంగాణలో యువ ఓటర్లు భారీగానే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు సాగింది.
అయితే తెలంగాణ ఏర్పాటై 9 ఏళ్లు గడుస్తున్న.. నీళ్లు, నిధులు మాట ఎలా ఉన్నా నియామకాల విషయంలో మాత్రం యువతలో అసంతృప్తి నెలకొంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ ప్రభావం కొంతమేర కనిపించిందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి తలెత్తితే ఇబ్బందుల్లో పడతామని భావించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి.. యువతను ఆకర్షించేందుకు భారీగా కొలువుల జాతరను చేపట్టారు.
తెలంగాణలో 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టుగా గతేడాది మార్చి నెలలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి వివిధ నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపి వేసింది. గప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 పరీక్ష పేపర్ కూడా లీక్ అవడంతో రాష్ట్రంలో యువత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై పోరాటంతో పాటు నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందిస్తుంది. ఓ వైపు రాహుల్ గాంధీతో వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. సరూర్ నగర్‌లో నిర్వహించిన సభలో ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటింపచేశారు.
ఇందులో నిరుద్యోగ యువతను ఆకర్షించేలా హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నవారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది.
మరోవైపు నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొంది. ప్రతి ఏడాది జూన్ 2 నోటిఫికేషన్లు విడుదల చేసి.. సెప్టెంబర్ 17 వరకు నియామకాలు పూర్తి చేయనున్నట్టుగా తెలిపింది.
కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దుతామని ఈ యూత్ డిక్లరేషన్ లో వెల్లడించారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిన పైన కూడా హామీ ఇచ్చారు. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఈడబ్ల్యుఎస్ వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ తోపాటు పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేసి 6 నుంచి పట్టభద్రులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 18 సంవత్సాలు పైబడిన చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందచేస్తామని ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ లో స్పష్టం చేసారు.
అయితే తెలంగాణలో అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు యువతే ప్రధానంగా ప్రణాళికలు రచిస్తుండటంతో.. వారు ఎటూ వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యువత ఓట్లను సాధించడంలో ఏ పార్టీ అయితే విజయవంతం అవుతుందో.. ఆ పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకునే అవకాశం కూడా లేకపోలేదు. దీనిని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో యువతను ఆకర్షించే పనిలో నిమగ్నం అయింది.