రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డాక్టర్ వైశాలి రెడ్డిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన సూత్రధారి నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్‌ను పట్టుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధాని నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఘటన జరిగిన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతున్న నవీన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గోవాలో అతనిని అదుపులోకి తీసుకున్నారు ఆదిభట్ల పోలీసులు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్‌ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదు ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని హైదరాబాద్ తరలిస్తున్నారు.
కాగా.. వైశాలి కిడ్నాప్ కేసులో ఇప్పటికే 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. గత ఏడాది బొంగులూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలితో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సమయంలో వైశాలి నెంబర్ తీసుకొని ఆమెకు తరచూ ఫోన్లు, మేసేజ్ లు చేసేవాడని పోలీసులు ఈ రిపోర్టు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత నవీన్ రెడ్డి వైశాలి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. అయితే తన పేరేంట్స్‌ని అడగాలని వైశాలి నవీన్ రెడ్డికి చెప్పిందని రిమాండ్ రిపోర్టు తెలిపింది. వైశాలి పేరేంట్స్ ను ఒప్పించేందుకు గాను నవీన్ రెడ్డి ప్రయత్నించాడు. కానీ నవీన్ రెడ్డికి వైశాలిని ఇచ్చి పెళ్లి చేసేందుకు వారు అంగీకరించలేదు.
ALso Read:డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నవీన్ రెడ్డి ప్లాన్: రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
దీంతో వైశాలి కుటుంబంపై నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నారని రిమాండ్ రిపోర్టు పేర్కొంది. వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి డాక్టర్ వైశాలితో తాను ఉన్న ఫోటోలను వైరల్ చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టు చెబుతుంది. ఐదు మాసాల క్రితం వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నవీన్ రెడ్డి అతని స్నేహితులు హంగామా చేశారు. ఈ విషయమై వైశాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని రిమాండ్ రిపోర్టు తెలుపుతుంది.
ఈ నెల 9వ తేదీన వైశాలికి నిశ్చితార్ధం ఉందని నవీన్ రెడ్డి తెలుసుకున్నాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నారని పోలీసులు వివరించారు. తన అనుచరులు, మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని డాక్టర్ వైశాలి కిడ్నాప్ కోసం ఉపయోగించుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. వైశాలి ఇంటి ముందున్న ఐదు కార్లను కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసులు వివరించారు.