తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వర్షాభావ పరిస్థితులు,వ్యవసాయ అవసరాలకు వినియోగం పెరిగింది.
హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ అవసరాలకు అవసరాలు పెరిగిపోవడంతో విద్యుత్ కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇవాళ 14,747 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.గత ఏడాది ఇదే రోజున 11, 198 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఈ నెల 15వ తేదీ నుండి విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తుంది.ఈ నెల 25న 14, 361 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నెలకొంది.
వర్షాకాలంలో కూడ భారీగా విద్యుత్ డిమాండ్ నెలకొంది. ఈ వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. దీంతో విద్యుత్ వినియోగానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది వేసవి కాలంలో కూడ విద్యుత్ డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి మాసంలో అత్యధికంగా 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. వేసవితో పోటీ పడి వర్షాకాలంలో విద్యుత్ వినియోగం నెలకొంది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కూడ విద్యుత్ వినియోగంపై ప్రభావం చూపుతున్నాయని ట్రాన్స్ కో శాఖాధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ కు డిమాండ్ పెరిగింది.గత ఏడాది ఆగస్టు మాసంలో 13,079 మెగావాట్ల విద్యుత్ వినియోగించారని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాకాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
రాష్ట్రంలో ఇప్పటికే వేసిన పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయే ప్రమాదం నెలకొంది. పంటలను కాపాడుకొనేందుకు రైతులు బోర్లపై ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ లో 35 నుండి 40 శాతం వ్యవసాయరంగం నుండే ఉంది.