ఆ అధికారులు నీళ్లకూ రంగులేస్తారేమో ?

First Published Jul 2, 2017, 4:11 PM IST
Highlights

తెలంగాణలో కొందరు అధికారుల తీరు చిత్ర విచిత్రంగా ఉంది. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. పాలకుల భజనలో టిఆర్ఎస్ కార్యకర్తలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారుల తీరుతో కొత్త వివాదాలు రగులుతున్నాయి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు రంగులు వేయక చాలారోజులైంది. దీంతో తెలంగాణ సాగునీటిపారుదల అధికారులు ఆ ప్రాజెక్టుకు రంగులేయాలని సంకల్పించారు. అంతవరకు బాగానే ఉంది.  అధికారులు మంచి ఆలోచన చేశారనుకోవచ్చు.  కానీ ఆ ప్రాజెక్టుకు రంగులేశారు. కానీ అది పెద్ద వివాదం రగిలిస్తోంది.

 

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గులాబీ రంగులేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో అధికార పార్టీ రంగు కూడా గులాబీదే కావడంతో అధికారులు నాగార్జున సాగర్ కు గులాబీ రంగులేయడం పట్ల ఆంధ్ర  నేతలు అభ్యంతరం లేవనెత్తారు. గులాబీ రంగులేయడానికి ఆ ప్రాజెక్టును ఏమైనా కెసిఆర్ సర్కారు కట్టించిందా అంటూ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 

కానీ అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఏ రంగు వేస్తే ఏమైంది. ఆ రంగు నాణ్యత బాగాలేకపోతే మాట్లాడండి అంటూ వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే వారి వాదనలో కూడా పాయింట్ లేకపోలేదు. కానీ గాలికి పోయే దాన్ని ఎక్కడో తగిలించుకున్నట్లు పోయి పోయి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాన్ని రగిలించారని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.

 

ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య అనేక విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో అనేక మంది బాధితులుగా ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారంలో అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ మరింత జఠిలం చేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీనికితోడు అధికారులుగా ఉన్నవారు గులాబీ రంగులు రుద్ది కొత్త వివాదం నెలకొల్పడం పట్ల జనాలు గుర్రుగా ఉన్నారు.

 

ఇంకా నయం నాగార్జున సాగర్ కు రంగులేశారు కానీ అందులోని నీళ్లకు కూడా రంగులేస్తారేమోనని కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!