తెలంగాణ మునిసిపల్ ఫలితాలు.... భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం

By telugu teamFirst Published Jan 25, 2020, 10:19 AM IST
Highlights

యువరాజు కేటీఆర్ కి పట్టాభిషేకం చేయడానికి ముందు జరుగుతున్న ఎన్నికలు. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెల్చి కెసిఆర్ కు డైరెక్ట్ సవాల్ విసురుతున్న తరుణంలో వెలువడుతున్న ఫలితాలు. 

తెలంగాణలోని మునిసిపల్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు తెలంగాణలోని రాజకీయాలకు బాటలు వేసేవిలా కనబడుతున్నాయి. ఈ మునిసిపల్ ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తరువాత జరుగుతున్న ఎన్నికలు అవడం ఒక ఎత్తు. 

యువరాజు కేటీఆర్ కి పట్టాభిషేకం చేయడానికి ముందు జరుగుతున్న ఎన్నికలు. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెల్చి కెసిఆర్ కు డైరెక్ట్ సవాల్ విసురుతున్న తరుణంలో వెలువడుతున్న ఫలితాలు. 

ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా వారి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అధికార తెరాస తన ఏకఛత్రాధిపత్యాన్ని చాటడానికి తహతహలాడుతుంటే... తెలంగాణాలో మేమె తెరాస కు ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు బీజేపీ చూస్తోంది. కాంగ్రెస్ ఏమో ఒకరకంగా అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. 

అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయ చిత్రపటాన్ని మాత్రం కండ్లకు కట్టినట్టు చూపెట్టబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్రిముఖపోరు నెలకొని ఉన్న నేపథ్యంలో ఎవరి ఓట్లు ఎటువైపు చీలుతాయో లెక్కలుకట్టేందుకు అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

అన్ని కార్పొరేషన్లలోనూ అధికార టీఆర్‌ఎస్‌ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినప్పటికీ... ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తిగా మారింది.  

తెరాస కు మెజారిటీ ఓట్ల శాతం వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేకున్నప్పటికీ... బీజేపీ, కాంగ్రెస్ ల కు  20–22 శాతం చొప్పున ఓట్లు వస్తాయనే అంచనా ఉంది. 

మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ రెండో స్థానాన్ని సంపాదించడం ఖాయంగా కనబడుతున్నప్పటికీ... కార్పొరేషన్లలో ఏ పార్టీ రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందనేదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. 

కార్పొరేషన్లలో కూడా కాంగ్రెసే రెండో స్థానంలో ఉంటుందని కొన్ని సర్వేలు చెపుతుండగా, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత కనబరిచే అవకాశాలున్నట్టు చెబుతున్నాయి. 

రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కార్పొరేషన్లలో బీజేపీ మంచి ప్రభావం చూపినట్టుగా అర్థమవుతుంది. వారు తాజాగా అక్కడ పార్లమెంటు స్థానాలు గెలవడం, హిందుత్వ కార్డును బలంగా వాడుకోవడంలో సఫలీకృతులవడం వల్ల ఈ ఫలితాలను సాధించేట్టుగా కనబడుతున్నారు. 

అయితే, కాంగ్రెస్‌ మాత్రం మునిసిపాలిటీల్లోలాగానే కార్పొరేషన్లలో కూడా బీజేపీ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తుంది. బీజేపీకి పడే ఓట్లు టీఆర్‌ఎస్‌ నుంచే చీలుతాయని లెక్కలుకట్టి తమకు లబ్ధి కలుగుతుందని ఒక అంచనాకు వచ్చారు. 

మొత్తంగా గనుక తీసుకుంటే... ఈ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి... ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరిందనేదానిపై భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. 

click me!