ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో షాక్: గాంధీభవన్ వెలవెల

By telugu teamFirst Published Jan 25, 2020, 2:19 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెసు అగ్రనేతలంతా అదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభ ఎన్నికల్లో హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో షాక్ తిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లోనూ దెబ్బ తిన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 

హుజూర్ నగర్ కు జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి భారీ మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదే హవాను టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించింది.

హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని మొత్తం 28 స్థానాల్లో 20 టీఆర్ఎస్ సొంతం చేసుకోగా, 7 స్థానాలు మాత్రమే కాంగ్రెసుకు వచ్చాయి. మరో స్థానాన్ని సిపిఎం గెలుచకుంది. నేరేడు చర్లలో టీఆర్ఎస్, కాంగ్రెసు గెలుచుకున్నాయి. ఒక్క స్థానాన్ని కమ్యూనిస్టు పార్టీ గెలుచుకుంది.

కాగా, మున్సిపల్ ఎన్నికల్లో పలువురు కాంగ్రెసు అగ్రనేతలు కంగుతిన్నారు. వారివారి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు తీవ్రంగా దెబ్బ తింది. దాంతో కాంగ్రెసు శ్రేణులు తీవ్రమైన నిరాశకు గురయ్యాయి. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్ వెలవెల బోతోంది. గాంధీ భవన్ కు ఎవరూ రావడం లేదు. మరోవైపు టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ సంబరాలతో తేలియాడుతోంది.  

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

click me!