తెలంగాణ శాసన మండలిలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు.
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. సతీష్ కుమార్ శనివారంనాడు శాసన మండలికి హాజరయ్యారు. శాసన మండలిలో ఆయన మాట్లాడారు కూడా.
ర్యాపిడ్ టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని, ఆయితే ఆర్టీపిసీఆర్ టెస్టులో మాత్రం పాజిటివ్ గా నిర్ధారణ అయిందన ఆయన చెప్పారు. గత ఐదు రోజులుగా తనను కలిసిన, తాను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
పురాణం సతీష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆయన కలిశారు. దీంతో శాసన మండలిలో కలకలం రేగుతోంది.
కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కేసులో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న తరుణంలో హైదరాబాదులోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను కుదించే ఆలోచన సాగుతోంది.