Karimnagar MLC Election 2021: 986 కు ఒక్క ఓటు టీఆర్ఎస్ తగ్గినా... ఈటలకు మంత్రి గంగుల సవాల్ (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 10, 2021, 1:44 PM IST
Highlights

తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. 

కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక (telangana mlc elections 2021) ల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8గంటలకే పోలింగ్ (mlc polling) ప్రారంభమయ్యింది. మద్యాహ్నం 4గంటల వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోంచుకోనున్నారు. ఈ క్రమంలోనే ఇంతకాలం క్యాంప్ లో వున్న కరీంనగర్ (karimnagar) టీఆర్ఎస్ (TRS) ప్రజాప్రతినిధులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ లో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వుందని... 1324లో దాదాపు వెయ్యి మంది తమ వాళ్ళే వున్నారని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) పార్టీలు బలం లేదని ఎన్నికల నుండి తప్పుకున్నాయని అన్నారు. కానీ కొందరు ఏకగ్రీవాన్ని ఇష్టపడక... కడుపు కళ్ళ మంటతో తమలో తమకే చిచ్చుపెట్టారని ఆరోపించారు. రెచ్చగొట్టి రవీందర్ సింగ్ (ravinder singh) ను నామినేషన్ వేయించారని గంగుల అన్నారు.  

Video

ఎవరి మద్దతిచ్చారో తెలీదు గానీ రవీందర్ సింగ్ బరిలో నిలిచాడని అన్నారు. అయితే దుష్టశక్తి వస్తే ఐక్యంగా ఉండి బలమేంటో చూపించాలనే ఇంతవరకు కలిసికట్టుగా వున్నాం. ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఓటేయడానికి వచ్చామని మంత్రి గంగుల తెలిపారు. 

read more  Telangana MLC Polls: తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

టీఆర్ఎస్ కి 986 ఓట్లలో ఒక్కటి తగ్గినా తమ క్రమశిక్షణ తగ్గినట్టేనని మంత్రి గంగుల పేర్కొన్నారు. అయినా బీజేపీ ఓట్లు మొత్తం వారికే పడతాయా? పడకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయా (bandi sanjay) లేక... ఎమ్మెల్యే ఈటల రాజేందరా (eatala rajender)... అని గంగుల సవాల్ విసిరారు. ఈ ఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతాయని గంగుల పేర్కొన్నారు.

శికండి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ బిజెపి నాయకులపై గంగుల మండిపడ్డారు. తల తెగినా తామంతా టీఆర్ఎస్ వైపే వుంటామని స్పష్టం చేసారు. రాష్ట్రాన్ని సాధించిన హక్కు దార్లం తామే... తమతో పెట్టుకున్న శికండిలంతా మాడి మసి అయిపోతారని మంత్రి హెచ్చరించారు. 

బిజెపి పార్టీ బలమెంతో చెప్పాలని బండి సంజయ్ ను మంత్రి గంగుల ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంది బిజెపి... అయితే రవీందర్ సింగ్ ను ఎవరు నిలబెట్టారు? మీలో చీలికనా లేక మీ పార్టీలో చీలికనా చెప్పాలని బండి సంజయ్ ని నిలదీసారు. 

read more  MLC Polls: ఇప్పటివరకు 30 శాతాని పైగా పోలింగ్ నమోదు.. ప్రలోభాలు జరిగినట్టు రుజువు కాలేదు: శశాంక్ గోయల్

తెలంగాణ రాష్ట్ర సమితి క్రమశిక్షణకు మారు పేరు గల పార్టీ అని మంత్రి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని (karimnagar district) రెండు స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేసారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 8 పోలింగ్ కేంద్రాలుండగా 1324 మంది ప్రజాప్రతినిధులు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదిమంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కరీంనగర్ జిల్లాలో గెలుపును టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 10 ఎసిపిలు, 26 మంది సిఐలు, 54 ఎస్సైలు,115 ఎఎస్సైలు, 323 మంది కానిస్టేబుల్ లతో భారీ భద్రత ఏర్పాటుచేసారు. 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేరుకుని ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపుర్, వీణవంకకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కలిసి బస్సుల్లో తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. 


 

click me!