రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గొర్రెల పంపిణీ పథకంపై ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తానని చెప్పి.. ఎగ్గొట్టిందని ఫైర్ అయ్యారు. ఎన్‌సీడీసీకి తామే రుణ చెల్లింపులు జరుపుతున్నామని, సకాలంలో చెల్లింపులు జరుపుతూ ఎన్‌సీడీసీ నుంచి అభినందనలు అందుకున్నామని వివరించారు. అడ్డగోలుగా, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్న బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు పెట్టుకున్నదో బీజేపీ చెప్పాలని అడిగారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన ప్రజల మధ్య, విలేకరుల సమావేశంలో.. ఏ వేదిక ఎక్కినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ ఒక పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, బాధ్యత కలిగిన వ్యక్తి.. ఇలా అబద్ధాలు మాట్లాడటమేంటని అడిగారు. అసలు ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ఎందుకు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీ గురించి మాట్లాడుతూ ఆయన బీజేపీపై విమర్శలు కురిపించారు మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు.
తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తలసాని అన్నారు. ఎన్‌సీడీసీ నుంచి రూ. 3,549.98 కోట్ల రుణం తీసుకుని ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని ముందు చెప్పిందని గుర్తు చేశారు. కానీ, ఆ తర్వాత ఎగనామం పెట్టిందని వివరించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఈ రుణం చెల్లింపులు చేస్తున్నదని చెప్పారు. ఎన్‌సీడీసీ స్వయంగా మన రాష్ట్రాన్ని పొగిడిందని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత పారదర్శకంగా రుణాలు చెల్లించడం లేదని కితాబిచ్చిందని వివరించారు. సకాలంలో రుణ చెల్లింపులు చేస్తున్నందుకు అభినందనలు తెలిపిందని అన్నారు. ఇలా చేస్తుంటే అన్ని విషయాల్లో కేంద్రమే బాధ్యత తీసుకుని పథకాలకు డబ్బులు ఇస్తున్నట్టు బండి సంజయ్ అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. గొర్రెల పంపిణీపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.
Also Read: పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం..: కేంద్ర సర్కారుకు తలసాని హెచ్చరిక (వీడియో)
బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని చెప్పారు. మాట్లాడటం తమకూ వస్తుందని, కానీ, బాధ్యత కలిగి ఉన్నవారు సంయమనంగా వ్యవహరించాలని అన్నారు. అబద్ధాలు, అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇంత అద్భుతంగా అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని దమ్ముంటే దేశమంతా అమలు చేసి చూపండని సవాల్ విసిరారు. కేంద్రంతో వారి ప్రభుత్వమే ఉన్నది కదా.. జనరంజక పథకమైన గొర్రెల పంపిణీని దేశమంతా అమలు చేయమనండి అంటూ అన్నారు.
Also Read: Bandi sanjay: బండి సంజయ్ నల్గొండ పర్యటనలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ శ్రేణుల నినాదాలు..
బండి సంజయ్‌కి తోడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని తెలిపారు. రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపులో తెలంగాణ ప్రభుత్వం పాత్ర లేదని ఎలా చెబుతారని మండిపడ్డారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు రామప్ప గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారని, రెగ్యులర్‌గా ఫాలో అప్ చేసిన తర్వాత ఈ గుర్తింపు లభించిందని వివరించారు. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వ పాత్ర లేదని చెప్పడం పచ్చి అబద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందిస్తున్నదని, అవార్డులనూ ఇస్తున్నదని తెలిపారు. కానీ, నిధులు మాత్రం ఇవ్వడం లేదని వివరించారు. ఇవన్నీ చూస్తున్నా.. బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని విమర్శలు చేశారు.