సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తాను.. రాజీనామా తర్వాత వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ కావడమే తరువాయి!

By team teluguFirst Published Nov 15, 2021, 5:20 PM IST
Highlights

సిద్దిపేట కలెక్టర్ (Siddipet Collector) వెంకట్రామి రెడ్డి (Venkatrami Reddy) సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం KCR మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని తెలిపారు. తనకు ఏ పదవి ఇచ్చిన తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు

సిద్దిపేట కలెక్టర్ (Siddipet Collector) వెంకట్రామి రెడ్డి (Venkatrami Reddy) సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియాతో మాట్లాడిన వెంకట్రామి రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పిలుపు రాగానే టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టుగా వెల్లడించారు. KCR మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ అణువణువు అర్థం చేసుకున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. అపార అనుభవంతో కేసీఆర్ తెలంగాణలో అభివృద్ది చేశారని తెలిపారు. సిద్దిపేట జిల్లాల్లో చేపట్టిన ప్రతి కార్యక్రమంపై తాము కేసీఆర్ విజన్‌తోనే నడుచుకున్నామని అన్నారు. 

సీఎం కేసీఆర్, మంత్రి Harish Rao ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటను అభివృద్దిలో దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దినట్టుగా చెప్పారు. ఎన్నో కొత్త ప్రాజెక్టులకు సిద్దిపేట జిల్లా వేదిక అయిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. తెలంగాణ కంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ది జరగడం లేదన్నారు. భూసేకరణ విషయంలో 9వేల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా భూమిని సేకరించామని చెప్పారు.

Also read: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ లోకి.. !!

ముంపు గ్రామాలను ఖాళీ చేసే విషయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. మొత్తం 26 ఏళ్ల సర్వీసులలో.. గడిచిన 7 సంవత్సరాలు తనకు సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. ఈ ఏడేండ్లలో సీఎం కేసీఆర్ తనను అనేక అభివృద్ది కార్యాక్రమాల్లో భాగస్వామ్యం చేశారని తెలిపారు. కేసీఆర్ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ పదవి ఇచ్చిన తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.  

ఇక, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును సీఎం ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. స్థానిక సంస్థల కోటా MLC Electionsల్లో వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ సీఎస్ సోమేశ్ కుమార్‌కు రాజీనామా లేఖ పంపారు. దానిని ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక, గతంలో సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కుర్చీలో కూర్చొన్న వెంకట్రామి రెడ్డి వెంటనే లేచి.. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.

click me!