మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు షురూ.. చేతికి పట్టీలు, కాళ్లకు కుట్లు ఇది వరకే చూశాం: తలసాని ఫైర్

By Mahesh KFirst Published Oct 25, 2022, 7:38 PM IST
Highlights

మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు మొదలయ్యాయని, సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. చేతికి పట్టీలు, కాళ్లకు కుట్లు కట్టుకోవడం ఇది వరకే దుబ్బాక, హుజురాబాద్‌లో చూశామని, ఇవాళ జ్వరం అంటాడు.. రేపు టీఆర్ఎస్ వాళ్లు కొట్టారంటారని ఆరోపణలు చేశారు.
 

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల డ్రామాలు షురూ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రజల సానుభూతి కోసం అగచాట్లు పడుతున్నాయని, చేతికి పట్టీలు, కాళ్లకు కుట్లు కట్టుకోవడం వంటివి ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్‌లలో చూశామని అన్నారు. నాలుగైదు రోజుల నుంచి తాను ఇదే చెబుతున్నారని, అదే ఇప్పుడు నిజమైందని తెలిపారు. ఇవాళ జ్వరం, రేపు దాడులు అని ఏడుపు డ్రామాలు నడుపుతారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. 

ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండేదని, దాని కారణంగా చాలా మంది వికలాంగులయ్యారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ సమస్య పూర్తిగా తీరిపోయిందని వివరించారు. ఈ విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గెలిచినా చేసే మేలు ఏదీ ఉండబోదన్నారు. ఆయన స్వప్రయోజనాల కోసమే రాజీనామా చేశారని వివరించారు. 

టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని, అసెంబ్లీ ఎన్నికల్లోపు అభివృద్ధి చూపెడుతామని అన్నారు. లేదంటే.. అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామని తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. 

Also Read: కోమటిరెడ్డి బ్రదర్స్ మోసగాళ్లే:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్

బీజేపీకి మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో ఈ సెంటిమెంట్ డ్రామా ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. తాము కాంట్రాక్టర్ల కోసం రాజకీయాలు చేసేవాళ్లం కాదని విమర్శలు సంధించారు.

బీజేపీ స్థాయి మరిచి వ్యవహరిస్తున్నదని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వెయ్యి కోట్లు తెస్తామని అంటున్నాడని, ఎక్కడి నుంచి తీసుకువస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ 18 వేల కోట్ల నుంచి తీసుకువస్తారా? అని ఎద్దేవా చేశారు.

click me!