జలవివాదం.. అనుమతులు తెచ్చుకుని ‘‘ రాయలసీమ ’’ ప్రాజెక్ట్ కట్టుకోండి: శ్రీనివాస్ గౌడ్

By Siva KodatiFirst Published Jul 1, 2021, 2:59 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుపోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. గురువారం మహబూబ్ నగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.

Also Read:నాడు సాగర్ వద్ద ఘర్షణ: నేడు ఆ మూడు ప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత

తెలంగాణలో వ్యాపారాలు అడ్డుకుంటున్నారని తెలంగాణలోని ఏపీ ప్రజలు ఏనాడైనా చెప్పారా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. వారి ఆస్తులు, ఉద్యోగాలు, పరిశ్రమలను తాము ఏమైనా ఇబ్బందులు పెట్టామా? అని నిలదీశారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలోని కాలనీలు, పార్కులకు పెట్టిన ఆంధ్రా వారి పేర్లను తామేమైనా తొలగించామా? అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. అసలు ఆనాడు ఆంధ్రా నేతలే తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో పలకకుండా చేశారని మంత్రి గుర్తుచేశారు. వేలాది మంది మరణాలకు నాటి ఆంధ్ర నాయకులే కారణమన్నారు. 

click me!