వర్షాకాలం రాబోతోంది... రైతులంతా పంటలు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ సమయంలో మరోసారి రైతు భరోసా (రైతు బంధు) అంశం తెరపైకి వచ్చింది. రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయం ఎంత చేస్తుంది? ఇప్పుడు రైతుల మధ్య ప్రధాన చర్చ ఇదే... మరి కాంగ్రెస్ సర్కార్ ఆలోచన ఏంటి..?
హైదరాబాద్ : పదేళ్ళ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయంలో ఆరు గ్యారంటీ హామీలదే కీలక పాత్ర... ఈ విషయం అందరికీ తెలిసిందే. మహిళలను ఉచిత బస్సు, నెల నెలా రూ.2500 ఆర్థిక సాయం... రైతులకు రూ.2 లక్షల రుణమాపీ, రైతు భరోసా పెంపు వంటి హామీలతో తమవైపు తిప్పుకుంది కాంగ్రెస్. ఈ హామీలకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ను గద్దెదింపి కాంగ్రెస్ కు పాలనా పగ్గాలు అప్పగించారు. అయితే కేవలం వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీ హామీలు అమలుకు నోచుకోకపోవడంతో రేవంత్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మొదలయ్యింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు సైతం రేవంత్ సర్కార్ ను రుణమాపీ, రైతు భరోసా పెంపుపై ప్రశ్నిస్తున్నారు.
రైతు భరోసా సంగతేంటి?
undefined
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లు అధికారంలో వున్న బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇస్తూ వచ్చింది. రైతు బంధు పేరిట ఏడాదికి రెండుసార్లు 'రైతు బంధు' పేరిట ఆర్థిక సాయం అందించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు పెట్టుబడి సాయం పెంపు హామీ ఇచ్చింది. కేసీఆర్ ఏడాదికి పదివేలు ఇస్తే తాము ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ వైపు మళ్లారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా పెంపుపై రైతాంగం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం వారి ఆశలను అడియాశలు చేసింది... పాత పద్దతిలోనే అంటే కేసీఆర్ ఇచ్చినంత సొమ్మునే రైతుల ఖతాలో వేసి చేతులు దులుపుకుంది. ఇలా ఇచ్చిన హామీని విస్మరించి రైతు భరోసా సాయం పెంచకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ పై ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలే కాదు రైతులు కూడా ఆగ్రహంతో వున్నారు.
అయితే ఈసారి రైతు భరోసా పెంపు వుంటుందన్న ఆశతో వున్న రైతులకు తాజాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైతు భరోసా పెంపుకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు ఇంకా ఖరారు కాలేవంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది. అంటే ఈసారి కూడా రూ.15 వేల ఆర్థిక సాయం లేనట్లేనా..? అంటే మంత్రి కామెంట్స్ అవును అనేలా వున్నాయి.
మరికొద్ది రోజుల్లో వేసవికాలం ముగిసి వానాకాలం మొదలవుతుంది. వర్షాలు ప్రారంభానికి ముందే రైతులు భూమిని సిద్దం చేసుకుని సాగుకు రెడీ అవుతారు. కాబట్టి వారు మళ్లీ ఆర్థిక కష్టాలకు గురికాకుండా రైతు భరోసా అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. కానీ పెట్టుబడిసాయం ఎంత ఇస్తారు? అన్నదే ప్రశ్న. ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తారా? లేదంటే విధివిధానాల పేరుతో మళ్లీ దాటవేస్తారా? అన్న అనుమానం రాజకీయ వర్గాల్లోనే కాదు రైతాంగంలో మొదలయ్యింది. మరి రేవంత్ సర్కార్ చేస్తుందో చూడాలి.
రాబోయే ఖరీఫ్ పంటకు కూడా రైతు భరోసా లేనట్లే!
ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధివిధానాలు, నిబంధనలు ఖరారు కాలేదు ఖరీఫ్ (వానా కాలం) పంట అయిపోయిన తరువాత చూద్దాం - మంత్రి శ్రీధర్ బాబు pic.twitter.com/GWnoIU80ln
రైతు రుణమాపీ సంగతేంటి..?
''కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షలలోపు రైతు రుణాలను మాపీ చేస్తాం. ఎవరైనా రైతులు రుణాలు తీసుకోకుంటే ఇప్పుడే బ్యాంకులకు వెళ్లి తీసుకొండి'' ఇది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి రాగానే మాట మార్చారు... వందరోజుల పాలన పూర్తయినా ఇప్పటివరకు రుణ మాపీ చేసిందిలేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న రుణమాపీ చేస్తానన్న రేవంత్ లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి పంద్రాగస్ట్ అంటున్నారు. ఆగస్ట్ 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు రైతు రుణాలు మాపీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి చూడాలి... ఈసారైన రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడేమో అని రైతులు అనుకుంటున్నారు.
వడ్లకు రూ.500 బోనస్ హామీ ఏమయ్యింది..?
ఇక రైతులకు ఇచ్చిన మరో హామీపై కూడా రేవంత్ సర్కార్ మాటతప్పింది. గతంలో కేసీఆర్ సర్కార్ ''వరి వేస్తే ఉరే'' అంది... కానీ రేవంత్ మాత్రం ఎంత కావాలంటే అంత వరిపంట వేసుకోవాలని... మంచి ధరతో వడ్లను కొనే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. రూ.500 బోనస్ ఇచ్చిమరీ వడ్లు కొంటామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
అయితే తాజాగా వడ్లకు బోనస్ విషయంలో రేవంత్ సర్కార్ మాట మార్చింది. కేవలం సన్నవడ్లు పండించే రైతులకు మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీజన్ నుండే బోనస్ అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కానీ వడ్లు పండించే ప్రతి రైతుకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే పరిమితం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. వడ్లు పండించే ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసారు.
రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది
లోక్ సభ ఎన్నికల సందర్భంగా సరిగ్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ 21న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు https://t.co/TlUtkXrnaq pic.twitter.com/JbsVAb21P1