బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి: కిషన్ రెడ్డిపై సత్యవతి రాథోడ్ ఫైర్

By narsimha lode  |  First Published Sep 27, 2022, 1:55 PM IST

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తప్పు బట్టారు. కేంద్రం నిర్ణయం గిరిజనులకు శాపంగా మారనుందన్నారు. 


హైదరాబాద్:  బయ్యారంలో తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు  హైద్రాబాద్ లోని  టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్  మీడియాతో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని జనం రోడ్ల మీదికి రాకముందే  ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.

తెలంగాణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమీ చేయలేదన్నారు. కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహం మాత్రమేనని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందన్నారు. స్వంత ప్రయోజనాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు.  బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.

Latest Videos

 బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ విషయమై  చేసిన వ్యాఖ్యలు కిషన్ రెడ్డివా మోడీవో తేల్చిచెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  కేంద్రం నిర్ణయం తమ ప్రాంత అభివృద్దికి తీవ్ర విఘాతంగా మారనుందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోందని  ఆమె  చెప్పారు.  కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డేనా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఐదేళ్లుగా కేంద్రం నాన్చివేత వైఖరిని అవలంభిస్తుందన్నారు మంత్రి రాథోడ్.తెలంగాణ మీద బీజేపీకి కళ్లమంట కలుగుతుందని  మహబూబాబాద్ ఎంపీ కవిత చెప్పారు.  బీజేపీకి తెలంగాణ ప్రజలు సరైన సమాధానం చెబుతారన్నారు. 

click me!