కేటీఆర్ ఉపదేశం: బిజెపిని లైట్ తీసుకోండి, కాంగ్రెస్ కు కౌంటర్ ఇవ్వండి..

By Siva KodatiFirst Published Aug 1, 2020, 3:10 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని.. బీజేపీని లైట్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని.. బీజేపీని లైట్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం కేటీఆర్ మాట్లాడుతూ... 2001 జూలైలో జల దృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంతో కేసీఆర్ మంచి లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని ఆయన గుర్తుచేశారు.

టీఆర్ఎస్ ఏర్పాటైన ముహూర్తం చాలా బలమైనదని, వంద సంవత్సరాల పాటు ఇలాగే పార్టీ ధృడంగా ఉంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు పాలనలో జల దృశ్యం నుంచి తమను రోడ్డుపైకి గెంటేశారని, కానీ ముహూర్త బలం కారణంగానే తాము ఇక్కడిదాకా వచ్చినట్లు మంత్రి తెలిపారు.

రోడ్డుపై పడ్డ పరిస్ధితి నుంచి ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ భవన్‌లో 60 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. అన్నం తిన్నారో అటుకులు బుక్కారో కానీ అన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని కార్యకర్తలు టీఆర్ఎస్‌ను ఇంత ఎత్తుకు తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ మొదటి 13 సంవత్సరాల కాలంలో అనేక కుట్రలు జరిగాయని ఆయన విమర్శించారు. పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 47 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కట్టామని, వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

ప్రస్తుతం భారతదేశంలో ఏ పార్టీ లేనంత పటిష్టంగా టీఆర్ఎస్ పార్టీ వుందని, ఎలాంటి ఎన్నికలైనా ప్రత్యర్థులను తమ పార్టీ కకావికలం చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కార్యకర్తల ఇంటికే ఇన్సూరెన్స్ చెక్కులు అందించామని.. జిల్లాల్లో పార్టీ కార్యాలయ భవనాలు దాదాపు పూర్తి అయ్యాయన్నారు.

కోవిడ్ సంక్షోభంతో శిక్షణా కార్యక్రమాలు వాయిదా వేశామన్నారు. తన జన్మదినం సందర్భంగా తన నియోజకవర్గానికి 6 అంబులెన్స్‌లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో మిగతా నాయకులు కూడా అందరూ కలిసి 100కు పైగా అంబులెన్స్‌లు సమకూర్చారని.. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా వుందామని  కేటీఆర్ పిలుపునిచ్చారు. 

click me!