కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం పరిషత్ సమావేశంలో మాస్కు పెట్టుకోలేదని ఓ వెటర్నరీ డాక్టర్‌కు అధికారులు జరిమానా విధించారు. అయితే.. అదే సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ఒకరు ఎలాంటి మాస్క్ లేకుండా అక్కడకు రావడం గమనార్హం.
ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. కరోనా సోకినవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. మన దేశంలో కనీసం రోజుకి 50వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఫేస్ కి మాస్క్ ధరించడం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. అయితే.. ఈ చర్యలు కేవలం సామాన్యులకేనా.. అధికారులకు వర్తించవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా కరీంనగర్ లో జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ.
ఇంతకీ మ్యాటరేంటంటే... కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం పరిషత్ సమావేశంలో మాస్కు పెట్టుకోలేదని ఓ వెటర్నరీ డాక్టర్‌కు అధికారులు జరిమానా విధించారు. అయితే.. అదే సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ఒకరు ఎలాంటి మాస్క్ లేకుండా అక్కడకు రావడం గమనార్హం.
అయితే.. వెటర్నరీ డాక్టర్ కి జరిమానా వేసిన అధికారులు మాస్కు పెట్టుకోకుండా వచ్చిన స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు వేయలేదని లోక్‌సత్త ఉద్యమ సంస్థ కన్వీనర్ ఎన్ శ్రీనివాస్ ప్రశ్నించారు. చట్టాలు అందరికీ సమానమే అయినప్పుడు అధికారిపై ఫైన్ వేసినప్పుడు ఎమ్మెల్యే రవిశంకర్‌కు కూడా విధించాల్సి ఉండేనన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. దీనిపై సదరు ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది.