చేనేత కోసం వినూత్న ఆలోచన... స్వదస్తూరితో మోడీకి పోస్ట్ కార్డ్ రాసిన కేటీఆర్, మరో ఉద్యమానికి పిలుపు

By Siva KodatiFirst Published Oct 22, 2022, 9:53 PM IST
Highlights

చేనేత పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మోడీకి స్వదస్తూరితో పోస్ట్ కార్డులు రాసే ఉద్యమాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికుల కోసం అందరూ కలిసి ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధాని మోడీకి స్వదస్తూరితో పోస్ట్ కార్డులు రాసే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్ట్ కార్డును తీసుకుని తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్వయంగా తన స్వహస్తాలతో మోడీకి రాసి పంపారు కేటీఆర్. రాష్ట్రంలోని చేనేత కార్మికులతో పాటు ఈ రంగాన్ని ఆదుకునేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని.. అందరూ కలిసి ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

అంతకుముందు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి జీవనోపాధిని అందిస్తున్నది చేనేత రంగమేనని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు చిన్నప్పటి నుంచే చేనేత కార్మికుల కష్టాలు తెలుసునని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడు పద్మశాలి కుటుంబం ఇంట్లోనే వుంటూ చదువుకున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్.

ALso Read:చేనేత కళాకారుల డిజైన్లు కాపీ కొడితే లోపలేయిస్తా : పద్మశాలి సభలో కేటీఆర్ హెచ్చరికలు

2002లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కోసం కేసీఆర్ స్వయంగా జోలెపట్టి విరాళాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున అప్పగించారని.. 2007లో కరీంనగర్ ఎంపీగా చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రూ.50 లక్షల నిధులను ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.70 కోట్లుగా వున్న చేనేత బడ్జెట్‌ను ఏకంగా రూ.1200 కోట్లకు పెంచారని తెలిపారు. 

 

 

గడిచిన ఎనిమిదేళ్లలో చేనేత శాఖకు ఇప్పటి వరకు రూ.5,752 కోట్లని కేటీఆర్ చెప్పారు. ప్రతీ ఏటా కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నామని.. చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుని లోపలేయిస్తామని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే చట్టాలను మార్చేలా బాధ్యత తీసుకుంటామని.. చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు. 

 

చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి ఈరోజు ప్రధాని నరేంద్రమోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు. pic.twitter.com/EjfEgB5MpG

— TRS Party (@trspartyonline)
click me!