భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
గురువారంనాడు హుస్సేన్ సాగర్, మూసీ పరివాహక ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. పరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. 24 గంటలు అధికారులు అందుబాటులో ఉన్నారని మంత్రి చెప్పారు. భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా మంత్రి వివరించారు. అధికారుల నైతిక స్తైర్యం దెబ్బతినేలా మాట్లాడొద్దని ఆయన విపక్షాలకు సూచించారు.
అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్టుగా మంత్రి చెప్పారు.భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. రేపు వరంగల్ కు వెళ్లాలని మున్సిపల్ శాఖ డైరెక్టర్ ను ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడ వరంగల్ వెళ్లనున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.
also read:యాదాద్రి భువనగిరి నక్కవాగులో బైక్‌తో కొట్టుకుపోయిన వ్యక్తి: కాపాడిన స్థానికులు
వర్షాకాలం ప్రారంభానికి ముందే హైద్రాబాద్ నాలాల్లో పూడిక తీశామన్నారు. దీని కారణంగానే ఇబ్బందులు తగ్గాయని మంత్రి అభిప్రాయపడ్డారు. కడెం ప్రాజెక్టు గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. మున్సిఫల్ శాఖ మంత్రిగా తనకు కడెం ప్రాజెక్టు గురించి తెలియదన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పరిస్థితి గురించి తనకు అవగహన ఉందని ఆయన చెప్పారు. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టుగా మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. పురపాలక శాఖ అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారని మంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరంలోనూ జిహెచ్ఎంసి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పనిచేస్తున్నారన్నారు. పురపాలక ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్టుగా మంత్రి చెప్పారు. భారీ వర్షాలతో ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురౌతుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యంగా మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని మంత్రి తెలిపారు. నగరంలోని135 చెరువులకు గేట్లు బిగించామని మంత్రి వివరించారు.
గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి ఉండేదన్నారు. ఈ దఫా నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలపాటు పనిచేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆయన సూచించారు.
వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అలెర్ట్ చేస్తున్నట్టుగా మంత్రి చెప్పారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లు, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు.