తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరం: ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్

By narsimha lodeFirst Published Aug 3, 2023, 2:47 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో  ఆసక్తికర సన్నివేశం చోటు  చేసుకుంది.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను  మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గురువారంనాడు  ఆసక్తికర సన్నివేశం చోటు  చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీటు వద్దకు  వెళ్లి మంత్రి కేటీఆర్ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పది నిమిషాలు  మంత్రి కేటీఆర్ ముచ్చటించారు.  

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగిన  బడ్జెట్ సమావేశాల సమయంలో కూడ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల వద్దకు  వచ్చి  మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్,ఆ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన రాజాసింగ్  లు లాబీల్లో మాట్లాడుకున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగం పూర్తైన తర్వాత లాబీలవైపు వస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలను చూసి కేటీఆర్ వాళ్ల వద్దకు వెళ్లారు.  వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. 

గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో  ఈటల రాజేందర్ కొనసాగిన విషయం తెలిసిందే.  పేదల భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో  మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు.  ఈ పరిణామంతో  ఈటల రాజేందర్  బీజేపీలో చేరారు.  బీజేపీలో  చేరడానికి ముందే  బీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

also read:మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ: బీఏసీలో నిర్ణయం, బీజేపీకి రాని ఆహ్వానం

2018  ఎన్నికల ఫలితాల తర్వాత  కేసీఆర్ మంత్రివర్గంలో  చోటు దక్కించుకున్న ఈటల రాజేందర్  కొన్ని సమయాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ  పార్టీకి ఓనర్లమంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో గ్యాప్ పెరిగిందనే ప్రచారం సాగిన నేపథ్యంలో  ఈటల రాజేందర్ ను  కేటీఆర్  ప్రగతి భవన్ కు తీసుకువెళ్లారు. కేసీఆర్, కేటీఆర్,  ఈటల రాజేందర్ చర్చించారు. అయినా  కూడ  ఈ గ్యాప్ తగ్గలేదు. తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.  మూడు రోజుల పాటు  అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

click me!