
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్ టీమ్ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై కేటీఆర్ టీమ్ ప్రధానంగా దృష్టి సారించింది. చివరి రోజు కేటీఆర్ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించగా.. 4 కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. లైఫ్‌సైన్సెస్, ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. కేటీఆర్‌తో సమావేశం తర్వాత కంపెనీలు నిర్ణయాలను ప్రకటించాయి.
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించంది. రాబోయే మూడు సంవత్సరాల్లో దాదాపు రూ. 150 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నట్టుగా తెలిపింది. ఇందులో భాగంగా cGMP Labతో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించబోతుంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు 2300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు వివరించారు.
యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా (USP) ఇండియా హైదరాబాద్‌లో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. 20 మిలియన్ డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో కొత్త నిరంతర తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అత్యాధునిక ప్రయోగశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, మూలధనం కోసం గడిచిన రెండు సంవత్సరాల్లో యుఎస్పి ఇండియా 5 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని 70 మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించిందని మంత్రి కేటీఆర్ కు యుఎస్పి బృందం వివరించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే అడ్వాన్స్ డ్ ల్యాబ్ లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లోని అడ్వెంట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. భారత్‌లోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో రూ. భారీ పెట్టుబడులు పెట్టేందుకు Advent International ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories) లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయాన్ని కంపెనీ కేటీఆర్‌కు తెలిపింది. అడ్వెంట్ కంపెనీ పెట్టుబడుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ స్ప్రింక్లర్ హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కేటీఆర్ బృందం న్యూయార్క్‌లో కంపెనీ ప్రతినిధులను కలిసిన సందర్భంగా వెల్లడించింది. హైదరాబాద్‌లో నూతన ఐటీ కార్యాలయం ద్వారా వెయ్యి మందికి ఐటీ ఉద్యోగులకు ఉపాధి లభించనుంది.
ఇక, అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో, ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ (newyork) వీధుల్లో కేటీఆర్ కాసేపు గడిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో తనకు అత్యంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ రుచిచూశారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా వున్న కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, క్యాబ్‌లో వెళ్లడం.. వంటి విషయాలను గమనించి తెలుగు ఎన్నారైలు ఆశ్చర్యపోతున్నారు. ఆయన సాధారణ జీవన శైలి, నిబద్ధతను చూసి ప్రశంసిస్తున్నారు.
అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఎన్నారైలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రాధాన్యతను, ఏడేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. పాఠశాలల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు వస్తే స్థానికులు స్ఫూర్తిగా తీసుకొంటారని చెప్పారు.