పసికందు ఆకలి తీర్చిన మంత్రి హరీశ్.. పాల కొరత తీర్చడానికి ఆవునే కొనిచ్చిన మంత్రి

By Mahesh KFirst Published Mar 23, 2023, 8:10 PM IST
Highlights

ఆదిలాబాద్ జిల్లాలో ఓ పసికందు ఆకలిని మంత్రి హరీశ్ రావు తీర్చారు. పత్రికలో వచ్చిన వార్త చదివి చలించిన మంత్రి తక్షణమే పాపకు సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. పుట్టిన పది రోజులకే తల్లి మరణించడం, వారి గూడెంలో పాలిచ్చే ఆవు, మేకలు లేకపోవడంతో పాల కోసం తండ్రి, తాత రోజు పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. వారికి పాలిచ్చే ఆవును కొనిచ్చి పాప సమస్యను మంత్రి తీర్చారు.
 

హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఒక వార్తా పత్రికలో వచ్చిన వార్తను చూసి చలించిపోయారు. పసిపాప ఆకలి తీర్చేందుకు పది కిలోమీటర్ల ప్రయాణం శీర్షికతో వచ్చిన వార్త చదివి కదిలిపోయారు. వెంటనే సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాగడానికి పాలు లేక విలవిల్లాడుతన్న పసికందుకు ఆకలిని తీర్చారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుమూల ప్రాంతం రాజుగూడ. ఈ రాజుగూడ గూడేనికి చెందిన కొడప పారుబాయి జనవరి 10న ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, పది రోజులకు ఆ తల్లి అనారోగ్యంతో ప్రాణం విడిచింది. 

అప్పటి నుంచి చిన్నారి ఆకలితో అలమటించడం మొదలు పెట్టింది. పాప ఆకలి తీర్చడానికి తండ్రి జంగుబాబు, తాత బాపురావు పాల ప్యాకెట్ కోసం ప్రతి రోజూ సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది. ఎందుకంటే ఆ గూడెంలో ఎవరికీ ఆవు గానీ, మేక గానీ లేదు. దీంతో పాల కోసం పరుగు పెట్టాల్సి వచ్చింది. ఈ సమస్యను ఓ పత్రిక ప్రచురించింది. 

Also Read: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ తేదీల్లో మార్పు.. 24న కాదు, 27న విచారణ

ఈ వార్త చూసిన మంత్రి హరీశ్ రావు ఆ బిడ్డకు తక్షణం సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బిడ్డకు పాల కొరత రాకుండా ఆవును సమకూర్చాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో సమీప పీహెచ్‌సీ సిబ్బంది పాల ప్యాకెట్లు, పౌష్టికాహార ప్యాకెట్లను బిడ్డ వద్దకు తీసుకెళ్లి అందించారు. తండ్రి కోరిక మేరకు శాశ్వత పరిష్కారంగా ఆవును కొనుగోలు చేసి అందించారు. బిడ్డకు ఏ సమస్య వచ్చినా తమకు తెలియజేయాలని సిబ్బంది భరోసా ఇచ్చారు. 

తమ సమస్యలపై స్పందించి సమస్య తీర్చినందుకు ఆ కుటుంబం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం బయట పడటంతో పాప ఆకలి తీర్చిన మంత్రిగా హరీశ్ రావుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేశారు.

click me!