
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన రోశయ్య 93వ జయంతి సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోశయ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోశయ్య ప్రతిపక్ష నేతగా అత్యంత కీలక పాత్ర పోషించారు. బడ్జెట్ ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేవారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇచ్చేవారు" అని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రాధాన్యం, సంక్షేమం, అభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన దార్శనికత ఉండేదన్నారు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పొన్నం ప్రభాకర్, తాను తెలంగాణ కోసం పోరాడుతుంటే, రోశయ్య గారు ఎంతో హుందాగా సలహాలు ఇచ్చేవారని మంత్రి గుర్తుచేసుకున్నారు. "తెలంగాణ కోసం కొట్లాడండి.. కానీ రెండు ప్రాంతాలకూ న్యాయం జరిగేలా ఆలోచించాలని చెప్పేవారు" అన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ సమయంలో తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ.. 'ఇది అభివృద్ధి కార్యక్రమం, ఎవరికీ వ్యతిరేకం కాదు' అని ఫోన్ చేసి మరీ చెప్పి, కార్యక్రమానికి హాజరై అందరినీ అభినందించిన గొప్ప సంస్కారం ఆయనదని కొనియాడారు.
పరిపాలనలో రోశయ్య సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని మంత్రి వివేక్ అన్నారు. రాత్రి వేళల్లోనూ సెక్రటేరియట్‌లో కూర్చుని ఫైళ్లను క్లియర్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి రోశయ్య గారేనని కొనియాడారు. ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. ఫైలును పూర్తిగా చదివి, ఏది రైటు, ఏది రాంగు, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని ఆలోచించిన తర్వాతే సంతకం చేసేవారని గుర్తుచేశారు.
రోశయ్యతో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. "మా నాన్నగారితో రోశయ్యకి ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఒక ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో కాకుండా.. నన్ను, వినోద్ని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. నాన్నగారిపై చూపించిన ప్రేమనే మాపైనా కురిపించారు. ఆయన చూపిన ప్రేమాభిమానాలకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులం" అని అన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, రోశయ్య కుటుంబ సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు, ప్రముఖులు, సాంస్కృతిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.