
హైదరాబాద్: అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సోమవారం నాడు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో కరోనా కట్టడిలోనే ఉందన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు.
ప్రతి రోజూ కనీసం 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.