పచ్చి అబద్ధాలు, సిగ్గు లేదు: కిషన్ రెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్

By telugu teamFirst Published Aug 21, 2021, 11:38 AM IST
Highlights

ప్రజా ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిప్పికొట్టారు. కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

హైదరాబాద్: తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిప్పికొట్టారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, బిజెపి వాళ్లకు సిగ్గు లేదని ఎర్రబెల్లి అన్నారు.  

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు తెస్తాడని అనునకున్నామని, కానీ ఏమీ తేలేదని ఆయన అన్నారు. గత ఏడేళ్లుగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమిటో చెప్పాలని ఆయన కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ కట్టే పన్నుల్లో సగం కూడా కేంద్రం తెలంగాణకు కేటాయించడం లేదని ఆయన అన్నారు. 

వరంగల్ జిల్లాలోని గిరిజన యూనివర్శిటికీ నిధులు ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారని, దాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వేటిని కేంద్రం నెరవేర్చలేదని ఆయన అన్నారు. బయ్యారం ఉక్కు కరమ్మగారం ఏమైందని ఆయన అడిగారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం కాల రాసిందని ఆయన విమర్శించారు. 

వైద్య కళాశాలలు అడిగితే ఇవ్వలేదని, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇచ్చి తెలంగాణకు ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణ బిజెపి ఎంపీలు రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకుని రాలేదని, పైగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే తెలంగాణ బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. కేంద్ర వైఫల్యం వల్లనే రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించాయని, తెలంగాణలో ఉత్పత్రి అయిన వ్యాక్సిన్ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఇచ్చారని గానీ తెలంగాణకు ఇవ్వలేదని ఆయన అన్నారు. 

కిషన్ రెడ్డి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తోనూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోనూ పోటీ పడుతూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

click me!