
వాళ్లది 'కేసీఆర్ బాకీ కార్డు'.. వీళ్లది 'కాంగ్రెస్ బాకీ కార్డు'.. తెలంగాణలో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల మధ్య బాకీ కార్డుల లొల్లి జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే.. మార్చింది తమ పార్టీనేనంటూ ఆ పార్టీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇటీవల ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుల మాట పలికే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఆయన మండిపడ్డారు. సుమారు రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. వాటికీ వడ్డీలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అంటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతీ నెలా రూ.6500 కోట్ల మేరకు వడ్డీలు కడుతున్నామని మహేష్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలన్ని కూడా ప్రస్తుతం ఒక్కొక్కటి బయటపడుతుండటంతో.. బీఆర్ఎస్ 'బాకీ కార్డు' పేరిట ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగిందని విమర్శలు గుప్పించారు. ప్రజలు ప్రభుత్వం పనితీరును గమనిస్తున్నారు. విష ప్రచారం చేయడానికి ఎంత ప్రయత్నించినా.. జూబ్లి హిల్స్ ఉపఎన్నికలోనూ, స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే.. దానికి కట్టుబడి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు.
మరోవైపు 'కాంగ్రెస్ బాకీ కార్డు'ను స్థానిక ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. తమకు ప్రజల అండదండలు ఉన్నాయని.. ఈ బాకీ కార్డు క్యాంపెయిన్‌తో కాంగ్రెస్‌ను ఓడించగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. ఈ క్యాంపెయిన్ ద్వారా కాంగ్రెస్ తప్పులను బయటపెడతామన్నారు కేటీఆర్. పొంగిపొర్లుతున్న మురికి కాలువలు, తొలగించని చెత్త లాంటి వాటితో హైదరాబాద్ నగరం ఇబ్బంది పడుతుంటే.. సీఎం రేవంత్ 'ఫ్యూచర్ సిటీ' నిర్మిస్తామని ప్రసంగాలు ఇస్తున్నారని విమర్శించారు కేటీఆర్.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించామని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక వేయకపోగా, ఉన్న రోడ్డు నెట్‌వర్క్‌ను సరిగ్గా నిర్వహించలేకపోతోందని దుయ్యబట్టారు. రైతులు మరోసారి ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువుల కోసం పోరాడాల్సి వచ్చింది. కొన్నిసార్లు క్యూలలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. నేడు తెలంగాణ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అదే విషాద దృశ్యాలను చూడాల్సి వస్తోందని ఆయన అన్నారు.