
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు భయపడ్డాడని అన్నారు. అందుకే తనను ప్రగతి భవన్‌లో కలువలేదని పేర్కొన్నారు. తనను కలిస్తే అవినీతి మీద ప్రశ్నలు వేస్తాననే తనను ప్రగతి భవన్‌లో అడ్డుకున్నారని వివరించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అని ఆరోపించారు. రాష్ట్రంలో తానే ప్రధాన ప్రతిపక్షం అని అన్నారు.
రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకువచ్చిన ప్రభుత్వం తమ చారిటీ భూములను ఆగం చేశాడని అన్నారు. తనను తిట్టిన జస్టిస్ ఉజ్జన్ భూయాన్ ట్రాన్స్‌ఫర్ అయ్యాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధానమైన మూడు పార్టీలు ఒక్కటే అని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైన జీ కిషన్ రెడ్డి.. కేసీఆర్‌కు మిత్రుడే అని అన్నారు.
తాను పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నాని, అందుకే బీఆర్ఎస్ వాళ్లకు తానంటే జంకు అని పేర్కొన్నారు. అందుకే వారు తనను ప్రధాన ప్రతిపక్షం అంటున్నారని చెప్పారు. తాను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు అందిస్తానని తెలిపారు.
Also Read: ‘ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయం.. ప్రధానితో సీఎం జగన్ అదే చర్చించారు’
తన డబ్బు అంతా అమెరికాలో ఉన్నదని కేఏ పాల్ చెప్పారు. ఆ డబ్బు ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. గత ఆరు నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషణ్ చీఫ్ పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటి చైర్మన్లను వెంటనే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ వెంటనే జస్టిస్ చంద్రకుమార్‌ను మానవ హక్కుల కమిషన్‌గా ఉండాలని కోరారు.