
Mlc Kavitha : దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు రికార్డు స్థాయికి పెరగడం.. దీని ప్రభావం నిత్యావసరాలపై పడటంతో సామాన్య ప్రజానీకంపై ఆర్థిక భారం మరింతగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆదివారం రూ.102.50 పెంచిన నేపథ్యంలో గ్యాస్ ధర పెంచడంపై నిజామాబాద్ శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కేంద్రంపై మండిపడ్డారు. ప్రజలపై భారాలు మోపుతున్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు, బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102 పెంచడం ఎన్నికల తర్వాత అతిపెద్ద ధరల పెంపుగా నిలిచింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత, ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతున్నదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై మరింతగా ఆర్థిక భారం పెంచుతుందని అన్నారు.
వాణిజ్య LPG ధర గతంలో మార్చి 1న ₹105 పెరిగింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నిజామాబాద్ MLC కవిత మరియు ఇతర పార్టీ నాయకులు ఇంధనం మరియు వంటగ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పౌరసరఫరాల కార్యాలయం వద్ద మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో నిరసనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. వంట నూనెలు సలసలమంటున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరగనున్నాయనే మార్కెట్ అంచనాల నేపథ్యంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెంచడంతో ప్రజలపై మరింతగా ఆర్థిక భారం పడనుంది. ఈ క్రమంలోనే మరోసారి ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచింది. గత మూడు నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు పెరగడం మూడో సారి. ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.102 వరకు పెంచి కస్టమర్లకు షాకిచ్చాయి. కొత్త ధర అమల్లోకి వచ్చిన తర్వాత.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2355కు పెరిగింది.