ఆమ్రపాలితో పోటీ పడుతున్న తెలంగాణ ఐపిఎస్ లు

First Published Oct 16, 2017, 6:36 PM IST
Highlights
  • కలెక్టర్ ఆమ్రపాలితో మరికొందరు సివిల్ సర్వెంట్ల హల్ చల్
  • ఆమ్రపాలితో పోటీ పడుతున్న యువ ఐపిఎస్ అధికారులు
  • తమలోని కళలను బయట పెడుతున్న యువ అధికారులు

పాలనలోనే కాకుండా ఇతరత్రా కార్యకలాపాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. ఆమె చేస్తున్న హడావిడి చూసి సహచర ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే ఆమ్రపాలితో మనమెందుకు పోటీ పడకూడదు అని కొందరు ఐపిఎస్ లు తాజాగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జాబితాలో ఉత్తర తెలంగాణ ఐపిఎస్ అధికారులు చోటు దక్కించుకుంటున్నారు.

ఆమ్రపాలి ట్రెక్కింగ్ ద్వారా, డ్యాన్స్ ల ద్వారా, టెన్ కె రన్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పారెస్టులో పర్యటించడం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ఆమె యువ ఐఎఎస్ అధికారిణి కావడం కూడా ఆమె నిత్యం జనాల్లో హల్ చల్ చేయడానికి కారణంగా చెబుతారు. దీనికితోడు ఆమె ఆంధ్రా అమ్మాయి (విశాఖపట్నం వాసి) కావడం కూడా ఆమె పట్ల జనాల్లో క్రేజ్ మామూలుగా లేదు అనడానికి కారణంగా చెబుతారు.

అయితే ఆమ్రపాలి పాలనతోనే కాకుండా దైనందిన జీవితంలో ఇతరత్రా యాక్టివిటీస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఐపిఎస్ అధికారులు కూడా కొందరు తమలోని ఉన్న వేర్వేరు రకాల టాలెంట్స్ ను బయట పెట్టుకుంటన్నారు. పరిస్థితి చూస్తే వీళ్లంతా ఆమ్రపాలితో పోటీ పడుతున్నట్లుగా ఉంది పరిస్థితి.

ఆ కోవలో రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ నిలిచారు. ఆయన ఇటీవల కాలంలో కమిషరెట్ ఏర్పాటు చేసి ఏడాది గడిచిన సందర్భంగా జరిగిన తొలి వార్షికోత్సవం కార్యక్రమంలో వేదిక మీద పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు సంగీతం అన్నా, కచేరీలో పాటలు పాడడం అన్నా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు విక్రంజిత్ దుగ్గల్. ఆయన 1987 నాటి పాపులర్ హిందీ సినిమా ఆషిఖీ లోని ‘‘ తుమ్ మెరీ జిందగీ హాయ్’’ అనే పాటను పాడి అందరినీ అలరించారు.

ఇక ఆదిలాబాద్ ఎస్పీ ఎం. శ్రీనివాస్ కూడా కొత్త కళలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తీరు చూసినా ఆమ్రపాలితో పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ తన అధికారిక భవనంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలో ఆయన కూడా ఒక పాట పాడి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తనను తాను గొప్ప గాయకుడిగా పరిచయం చేసుకున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ సినిమాలోని ఒక పాటకు డ్యాన్స్ చేసి హల్ చల్ చేశారు. ఎస్పీ చాలా సందర్భాల్లో పబ్లిక్ తో పాటు సినిమాలు చూస్తూ జనాల్లో కలిసిపోతున్నారు.

ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎం. చంపాలాల్ కూడా నిత్యం జనాల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు తనలో దాగి ఉన్న కళలలను ప్రదర్శిస్తున్నారు. ఆయన సివిల్ సర్వీస్ ఉద్యోగంలో చేరకముందు సినిమాల్లో పనిచేశానని చెప్పుకున్నారు. ఒకవేళ సివిల్స్ రాకపోతే తాను సినిమాల్లోనే ఉండిపోయేవాడినని చెప్పుకున్నారు. ఇప్పటికే ఒక నటుడిగా పేరు తెచ్చుకునేవాడినని అంటున్నారు.

మొత్తానికి యువ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలి లాగే ఈ ఐపిఎస్, ఐఎఎస్ అధికారులు కూడా తమదైన శైలిలో జనాల్లోకి వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. తమ కళలను ప్రదర్శిస్తున్నారు. ఇంకొందరు యువ సివిల్ సర్వెంట్లు కూడా రకరకాలుగా జనాల్లో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. సివిల్ సర్వెంట్లు అంటే గిరి గీసుకుని ఉండేవారు కాదు... జనాల్లో ఒకరు అన్న వాతావరణం నెలకొల్పేందుకు యువ రక్తం పోటీ పడుతున్న పరిస్థితి తెలంగాణలో ఉన్నదని చెప్పవచ్చు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/fJWa5i

 

click me!