
రమా రాజేశ్వరి. జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటంలో ఎస్పీగా వంద శాతం సక్సెస్ అయిన సూఫర్ పోలీస్ బాస్. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాఫ్ గ్రూపుల ద్వారా గ్రామాల్లో పిల్లల కిడ్నాపర్లు, హంతకులు తిరుగుతున్నారంటూ ప్రచారం జరిగి అమాయకులపై బలైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టి జిల్లాలోని ప్రతి గ్రామంలో శాంతిభద్రతలు కాపాడి ఎలాంటి హింస చెలరేగకుండా ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో రాష్ట్రంలోను, దేశంలోను ఈ తప్పుడు ప్రచారాలతో హింస చెలరేగినా గద్వాల జిల్లాలో మాత్రం శాంతిభద్రతలు వెల్లివిరిశాయి. దీనికి జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి అమలుచేసిన చర్యలు, ముందు చూపే కారణం.
జిల్లాలోని ప్రతి గ్రామంలోను ఈ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపై ముందుగా అవగాహన కల్పించాలని ఎస్పీ బావించారు. ఇందుకోసం జాన పద కళలను ఆయుధంగా ఎంచుకున్నారు. పోలీస్ శాఖ ద్వారా జానపద గాయకులు, డబ్బు కళాకారుల ఇలా అందరిచేత ఈ వాట్సాప్ తప్పుడు ప్రచారాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతే కాకుండా గ్రామాల్లో తానే స్వయంగా పర్యటించి ప్రజలు హింసకు పాల్పడవద్దని పందేశాన్నిచ్చారు.
అలాగే గ్రామాల్లోని పెద్దలతో మాట్లాడి వారి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపుల్లోకి స్థానిక పోలీసులు చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో ఈ గ్రూపుల్లో పిల్లల కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు, హంతకులు తిరుగుతున్నారన్న ప్రచారాన్ని తిప్పికొట్టి అమాయకులపై జరుగుతున్న దాడులను ఆపగలిగారు. గ్రామ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రచారం చేశారు. దీంతో జిల్లాలోని దాదాపు 400 గ్రామాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఉన్నాయి.
ఇక పోలీసులను ప్రజల్లో మిళితం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా ఎస్పీ. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో ప్రజలే గ్రామాల్లో శాంతిభద్రతలకు రక్షణగా నిలబడేలా చేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బందికి ఆన్ లైన్, సోషల్ మీడియా వ్యవస్థలపై అవగాహన కల్పించారు.దీని ద్వారా సైబర్ నేరాలను తగ్గించగలిగారు.
ఇలా పకడ్బందీగా ప్తాన్ చేసి గద్వాల జిల్లాలో శాంతి భద్రతలను కాపాడిన ఎస్పీ రమా రాజేశ్వరి ఇపుడు దేశంలోని పోలీసులకు ఈమె ఆదర్శంగా నిలిచారు. కాబట్టి రానున్న సాధారణ ఎన్నికల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరక్కుండా, హింస చెలరేగకుండా ఉండాలంటే రాజేశ్వరి బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె అనుసరించిన వ్యూహాన్ని దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనుసరించి ఎన్నికలు ప్రశాంతంగా జరగేలా చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.