ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ చెంచ్ కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లే వరకు తీర్పును సస్పెన్షన్ లో ఉంచాలని ఏజీ వినతికి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.
మొయినాబాద్ ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ 2022 డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ విషయమై ఇరు వర్గాలను హైకోర్టు డివిజన్ బెంచ్ విన్నది. అంతేకాదు రాతపూర్వకంగా గత నెల 30వ తేదీ వరకు హైకోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్నింటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసు విచారణను సీబీఐ అప్పగింతను సమర్ధించింది.
2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టేందుకు ముగ్గురు ప్రయత్నించారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ముగ్గురు ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే మొయినాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయమై ఆడియో, వీడియో సంభాషణలను కూడా మీడియాకు కేసీఆర్ అందించారు. సిట్ విచారణను బీజేపీ సహ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు వ్యతిరేకించారు. సీబీఐ విచారణ చేయాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
also read:ఎమ్మెల్యేల కొనుగోలుపై సీబీఐ విచారణను సవాల్ చేసిన కేసీఆర్ సర్కార్: ఈ నెల 6న హైకోర్టు తీర్పు
సిట్ విచారణ పారదర్శకంగా లేదని కూడా తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ విచారణ పారదర్శకంగా జరగాలంటే సీబీఐ విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ లో కేసీఆర్ సర్కార్ సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ కూడా సీబీఐ విచారణను సమర్ధించింది. ఈ విషయమై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.