
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టు విచారించింది.
స్థలాలను క్రమబద్దీకరించుకొనేందుకు గాను ఈ ఏడాది ఆగష్టు 31వ తేదీన తెలంగాణ ప్రభుత్వం 131 జీవోను జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం జారీ చేసిన 131 జీవోతో ప్రజల జేబులు ఖాళీ అయ్యే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also read:ఎల్ఆర్ఎస్ స్కీంలో ఫీజులపై కేటీఆర్ క్లారిటీ: దరఖాస్తుదారులకు భారీ ఊరట
దీంతో రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోకి సవరణ చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ నెల 16వ తేదీన అసెంబ్లీలో ప్రకటించారు. సవరణ చేసిన జీవో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
Also read: ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని హైకోర్టులో కోమటిరెడ్డి పిటిషన్
అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన 131 జీవో చట్టాలకు విరుద్దంగా ఉందని తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది విన్పించారు. తుది తీర్పుకు లోబడి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు. అక్టోబర్ 8వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.