ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 1:16 PM IST
Highlights

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు  చేసిన పిటిషన్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఎందుకని పైలెట్ రోహిత్ రెడ్డి లాయర్‌ను ప్రశ్నించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు  చేసిన పిటిషన్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై నమోదైన ఈడీ ఈసీఐఆర్‌ను కొట్టేయాలని రోహిత్ రెడ్డి పిటిషన్‌లో హైకోర్టును కోరారు. ఈ రోజు విచారణ సందర్భంగా రోహిత్ రెడ్డి తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రోహిత్ రెడ్డికి ఈడీ జారీ చేసిన సమన్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నిరంజన్ రెడ్డి.. 2015 ఏప్రిల్ నుంచి లావాదేవీల  వివరాలు తీసుకురమ్మని అడిగారని తెలిపారు. అయితే ఈడీ కేసు నమోదు చేసిందే డిసెంబర్ 15న అని చెప్పారు. మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ నమోదు చట్ట విరుద్దమని అన్నారు. ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో ఎక్కడా డబ్బు దొరకలేదని చెప్పారు. అలాంటప్పుడు ఈడీ ఎలా ఎంటర్ అవుతుందని అడిగారు. అయితే పార్టీ మారితే రూ. 100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పారు. 

ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. అదే రోహిత్ రెడ్డి కోరినట్టుగా ఈడీ విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. 

ఇక, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదానిగా ఉన్న సంగతి  తెలిసిందే. అయితే రోహిత్ రెడ్డి.. తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును అక్రమంగా ప్రకటించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘నేను ప్రధాన కేసులో ఫిర్యాదుదారుని. నా ఫిర్యాదు బీజేపీ ఇబ్బంది కలిగించింది. అందుకే వాళ్లు నాపై ఈడీని వదిలారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి హామీ ఇచ్చిన డబ్బు చెల్లించకముందే.. నిందితులను ట్రాప్ చేయడం జరిగింది. ప్రలోభపెట్టిన వీడియోను రికార్డు చేయడం జరిగింది. పోలీసుల కేసు బుక్ చేయబడింది. ఆర్థిక లావాదేవీలకు ముందే నిందితులను అరెస్టు చేసినందున.. డబ్బు కనుగొనబడలేదు.  అందుకే ఇక్కడ ఎటువంటి పీఎంఎల్ఏ కేసు ఉండటానికి అవకాశం లేదు’’ అని రోహిత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 15న ఈసీఐఆర్ నమోదు చేసి.. అదే రోజు సమన్లు జారీ చేసినందున ఈడీ అధికారులు పనిచేస్తున్న తీరుపై రోహిత్ రెడ్డి తన పిటిషన్‌లో సందేహం వ్యక్తం చేశారు.
 

click me!