ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. రేపు తుది వాదనలు వింటామన్న హైకోర్టు..

By Sumanth KanukulaFirst Published Dec 15, 2022, 3:30 PM IST
Highlights

ఎమ్మెల్యే‌లకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గురువారం కీలక వాదనలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులు, స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో వివరాలు ఎలా బయటపెడతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటపెట్టిన ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారని అడిగారు. 

ఫామ్‌హౌస్ ఘటనకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు అయిందని.. అలాంటప్పుడు ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్లు అన్నారు.  ఈ సందర్భంగా సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 17(b) ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని తెలిపారు. అయితే 2003లో ఏసీబీ పరిధిని నియమిస్తూ జీఓ జారీ చేశారని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. 2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ కేసులన్నీ.. ఏసీబీనే విచారించాలని జీవో ఉందని అన్నారు. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని ఆరోపించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. శుక్రవారం తుది వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

మరోవైపు  ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టేను తెలంగాణ హైకోర్టు మరికొంతకాలం పొడిగించింది. ఈ నెల 22 వరకు స్టే పొడిగిస్తూ న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇకపోతే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. సింహయాజీ గత బుధవారం చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితులకు ఏసీబీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే వీరు విడుదలైన వెంటనే వారిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. 

click me!