కామారెడ్డి జిల్లాలో బండరాళ్ల నుంచి క్షేమంగా బయటపడ్డ రాజు.. ఆస్పత్రికి తరలింపు..

By Sumanth KanukulaFirst Published Dec 15, 2022, 2:09 PM IST
Highlights

కామారెడ్డి జిల్లాలో గుహలో బండరాళ్ల మధ్య చిక్కుకున్న రాజును పోలీసులు బయటకు తీశారు. అనంతరం వెంటనే రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కామారెడ్డి జిల్లాలో గుహలో బండరాళ్ల మధ్య చిక్కుకున్న రాజును పోలీసులు బయటకు తీశారు. ఫారెస్ట్ ఏరియాలో వేటకు వెళ్లిన రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలోనే దాదాపు 43 గంటలకు పైగా నరకయాతన అనుభవించారు. అయితే రాజును బయటకు తీసుకురావడానికి అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. తీవ్రంగా శ్రమించిన అధికార యంత్రాంగం.. కొద్దిసేపటి క్రితం రాజును బయటకు తీశారు. అనంతరం వెంటనే రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే రాజు క్షేమంగానే ఉన్నారని చెబుతున్నారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. రాజు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

అసలేం జరిగిందంటే..
రెడ్డిపేటకు చెందిన చాడ రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం రాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అడవి ప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా అతడి సెల్ ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. అయితే మంగళవారం రాత్రి అయినా రాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అన్ని చోట్ల వెతికారు. చాలామందిని అడిగారు. అయితే లాభం లేకపోవడంతో.. ఫారెస్టు ఏరియా లోపలికి వెళ్లారు. 

ఈ క్రమంలోనే సింగరాయిపల్లి శివారులోని పెద్ద రాళ్ల గుట్ట మధ్యలో రెండు రాళ్ల మధ్య ఇరుక్కున్నట్లు గుర్తించారు. అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన లాభం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాజును బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెవెన్యూ, వైద్య సిబ్బంది.. రాజులో మనోధైర్యం నింపుతూ సహాయక చర్యలు చేపట్టారు. అతనికి ఆక్సిజన్, ద్రవ పదార్థాలు అందిస్తూ స్పృహ కోల్పోకుండా చర్యలు చేపట్టారు. 

బండ రాళ్ల మధ్యలో ఉన్న రాజుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తీవ్రంగా శ్రమించిన అధికారులు.. కొద్దిసేపటి క్రితం రాజును క్షేమంగా బయటకు తీశారు. 

click me!