
Sada Bainama: ఐదేళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరపడింది. తెలంగాణలో సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణలో ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ఈ సమస్యపై హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది. క్రమబద్ధీకరణకు సమర్పించిన దరఖాస్తులను పరిష్కరించడానికి ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులు ఇప్పుడు పరిష్కారించబడుతాయి.
ఇటీవల 2020 అక్టోబర్ 10న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోపై నవంబరులో హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ చర్యలు చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా క్రమబద్ధీకరణకు ప్రయత్నించాయని న్యాయస్థానం విమర్శించింది. కానీ, కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో క్రమబద్ధీకరణకు సంబంధించిన నిబంధనలు చేర్చినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించడంతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు తీర్పు ప్రకారం.. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సాగు చేస్తున్న రైతులు కూడా ఇప్పుడు తమ భూములపై హక్కులను రక్షించుకునే అవకాశం పొందారు. ఈ తీర్పుతో తెలంగాణలోని సుమారు 9.5 లక్షల మంది రైతులకు ఊరట కలిగింది. రైతులు ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో తమ భూముల హక్కులను సురక్షితం చేసుకోవచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతవారమే హైకోర్టు స్టే ను రద్దు చేసిన తరువాత, ఇప్పుడు పూర్తి కేసు విచారణ ముగియడంతో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేరుగా ప్రారంభంకానుంది.హైకోర్టు తీర్పు ద్వారా రిజిస్ట్రేషన్ లేని భూములను సాగు చేస్తున్న రైతులు తమ హక్కులు పొందుతారు. భూమి రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడం సమస్యగా ఉండేది. అయితే, ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం లభించడం రైతులకి పెద్ద ఊరటగా మారింది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హర్షం ..
సాదాబైనామాల హైకోర్టు గ్రీన్ ఇవ్వడంపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భూభారతి చట్టం సాదాబైనామాల సమస్య పరిష్కారానికి దారి చూపిందన్నారు. ఈ నిర్ణయంతో త్వరలో 9 లక్షలకు పైగా దరఖాస్తులపై మోక్షం లభించనుంది. హైకోర్టు తీర్పు లక్షలాది పేదల కలలను సాకారం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో సాదాబైనామాల విషయంలో ప్రభుత్వమే ప్రజలను నమ్మించి మోసం చేశారని మంత్రి విమర్శించారు. దరఖాస్తులను స్వీకరించాక కూడా వాటిని పరిష్కరించకపోవడం వల్ల 9.26 లక్షల దరఖాస్తులు నిలిచిపోయాయనీ, కొందరు రైతులు పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసారని, త్వరలో పరిష్కారం అమలు చేయబడుతుందని మంత్రి వెల్లడించారు.
ఇలా తెలంగాణలో సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణకు హైకోర్టు ఇచ్చిన అనుమతితో రాష్ట్ర రైతులు, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పత్రాల లేని భూములపై సాగు చేస్తున్న వారు, భవిష్యత్తులో తమ హక్కులను సులభంగా రక్షించుకునే అవకాశం ఏర్పడింది. ఈ తీర్పుపై రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.