
Nalgonda POCSO Court: ఇది తీర్పు మాత్రమే కాదు.. సమాజానికి ఓ హెచ్చరిక.. చిన్నారుల రక్షణలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. బాలిక భద్రత ప్రాధాన్యత ఇస్తూ ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఓ నిందితుడ్ని కఠినంగా శిక్షించింది. ఒక్కటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు షాకింగ్ తీర్పును ఇచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ కేసు వివరాలేంటి?
బాలికపై అత్యాచారం కేసులో నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువడింది. 2021లో ఒక చిన్నారి పై అత్యాచారం చేసిన షేక్ మహ్మద్ ఖయ్యూంపై IPC, POCSO, SC/STs (POA) చట్టాల కింద కేసు నమోదు చేయబడింది. కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి రోజా రమణి తుది తీర్పులో నిందితుడికి మొత్తం 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కఠిన తీర్పు ఇచ్చారు. ఇందులో POCSO చట్టం కింద 20 ఏళ్లు, SC/STs (POA) చట్టం కింద 20 ఏళ్లు, కిడ్నాప్ కేసుకు మరో 10 ఏళ్లు , మొత్తం 50 ఏళ్ల శిక్షను విధించారు.
ఈ సందర్బంగా జడ్జి రోజా రమణి మాట్లాడుతూ.. “బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు తప్పనిసరి. ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలి” అని పేర్కొన్నారు. ఈ తీర్పులో నిందితుడికి IPC కింద 20 ఏళ్ల జైలు శిక్ష , POCSO చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష , SC/ST చట్టం10 ఏళ్ల శిక్ష కింద విధించినట్టు తెలిపారు. అదనంగా రూ.85,000 జరిమానా, బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
అసలేం జరిగింది?
2021 నవంబర్ 3న నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అత్యాచార ఘటన జరిగింది. ఓ బాలిక స్కూల్ ముగించిన ఇంటికి వస్తుంది. ఈ సమయంలో షేక్ మహ్మద్ ఖయ్యూం అనే యువకుడు ఆ బాలికను బలవంతం చేసి, బండి ఎక్కించుకున్నారు. పట్టణ శివార్ల లోని ఓ పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తర్వాత తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
విచారణలో పోలీసులు కీలక ఆధారాలు సమర్పించారు. బాధితురాలు, కుటుంబ సభ్యులు, వైద్యులు, సాక్షులు సహా 20 మందికి పైగా సాక్షులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ కోర్టులో వాదిస్తూ, ఇలాంటి నేరస్తులకు కఠిన శిక్ష తప్ప మార్గం లేదని పేర్కొన్నారు. ఈ తీర్పు సమాజంలో చిన్నారుల భద్రతకు స్పష్టమైన సందేశం పంపుతోందని అన్నారు .