తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి సడలింపు కోరుతూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఎ వెంకన్నతో పాటు మరో ఐదుగురు.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో పెద్ద మొత్తంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 2వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి సడలింపు కోరుతూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఎ వెంకన్నతో పాటు మరో ఐదుగురు.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్‌లలో గరిష్ట వయో పరిమితిని 44 నుంచి 49 సంవత్సరాలకు సడలించాలని ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్పీకి తాము పలుమార్లు వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు. 2017 నుంచి TSPSC ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రాలేదని.. దీంతో వేల మంది నిరుద్యోగులు తమ తప్పు లేకుండానే ఉద్యోగాలకు అనర్హులుగా మారిపోయారని పేర్కొన్నారు. గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చి పదేళ్లకుపైనే అవుతోందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందని.. అందులో గరిష్ట వయోపరిమితిపై చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు. తమిళనాడులో కూడా అలాంటి సడలింపులు ఇచ్చారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తాము కూడా ఒక్కసారికి వయోపరిమితి సడలింపు కోరుతున్నట్టుగా చెప్పారు.
ఈ పిటిషనర్ల వాదనలు విన్న జస్టిస్ బి విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ), ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్), టీఎస్‌పీస్సీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వయోపరిమితి పెంచాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలని.. దీనిపై మూడు వారాల్లోగా నిర్ణయం తెలుపాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో 503 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్–1 ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి జనరల్ పోస్టులకు 44 సంవత్సరాలు, యూనిఫాం పోస్టులకు 31 సంవత్సరాలుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది.