
హైదరాబాద్: ఒమిక్రాన్ విషయంలో ఆందోళన చెందవద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు omicron కేసులు నమోదు కావడంపై తెలంగాణ మంత్రి Harish Rao స్పందించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు.కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు విదేశాల నుంచి వచ్చే అందరికీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు. సాధారణ టెస్ట్‌ల్లో భాగంగా ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందన్నారు. పాజిటివ్‌గా తేలిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు మంత్రి. ఒమిక్రాన్ వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో పెట్టామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్ ట్రేస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఫస్ట్‌డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తైందన్నారు.. అలాగే రాష్ట్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్ కూడా 64 శాతం పూర్తైనట్లు వివరించారు. బూస్టర్ డోస్ కోసం కేంద్రాన్ని కోరామన్నారు. ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని మంత్రి వివరించారు.. తెలంగాణలో 25,390 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చినట్లు వెల్లడించారు. ప్రజలంతా మాస్కులు, భౌతికదూరం పాటించాలని మంత్రి హరీష్‌రావు కోరారు.
తెలంగాణలో ఇద్దరికి ఒమిక్రాన్ సోకిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టుగా తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు నిన్న రాత్రి వచ్చినట్టుగా చెప్పారు. అందులో ఒకరు 24 ఏళ్ల మహిళని.. ఆమె కెన్యానుంచి ఈ నెల 12న తెలంగాణకు వచ్చారని చెప్పారు. ఆ యువతి టోలిచౌకిలో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆమె ఇంట్లోని ఇద్దరిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారని తెలిపారు. వారి శాంపిల్స్‌ను ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కు పంపించినట్టుగా వెల్లడించారు. యువతిని ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించినట్టుగా చెప్పారు.
also read:బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు.. వెల్లడించిన డీహెచ్ శ్రీనివాస్ రావు
రెండో వ్యక్తి సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని శ్రీనివాస్ రావు తెలిపారు. నాన్ రిస్క్ కంట్రీ నుంచి రావడంతో.. పరీక్షలు నిర్వహించి ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లేందుకు అనుమతించినట్టుగా తెలిపారు. ఇతను కూడా టోలిచౌకి ప్రాంతంలో ఉంటున్నట్టుగా చెప్పారు. అతన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. మరోకరికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయిందని.. అతడు 7 ఏళ్ల బాలుడని తెలిపారు. బాలుడి స్వస్థలం బెంగాల్ అని.. రాష్ట్రంలోకి రాలేదని వెల్లడించారు. అతడు విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి.. కోల్‌కతాకు వెళ్లినట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. బాధితుల్లో పెద్దగా లక్షణాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నట్టుగా వెల్లడించారు.