కరోనాకు భయపడొద్దు.. ప్లాస్మా దానం జీవితాలను నిలబెట్టింది: ఈటల

By Siva KodatiFirst Published Aug 20, 2020, 3:00 PM IST
Highlights

కరోనాకు మందు లేదని ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గమన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో గురువారం హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ప్లాస్మా దాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు

కరోనాకు మందు లేదని ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గమన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో గురువారం హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ప్లాస్మా దాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అమెరికా లాంటి దేశమే కోవిడ్‌తో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నామని ఆయన వెల్లడించారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకుని జీవిస్తాయని.. కానీ మనిషి మాత్రం ప్రకృతిని శాసించే స్థాయికి చేరుకున్నాడని ఈటల అన్నారు.

ఒకరికొకరు సాయంగా ఉండాలనే విషయాన్ని కరోనా గుర్తుచేసిందని.. డాక్టర్లు ఎంతో సాహసంతో చికిత్స చేస్తూ దేవుళ్ల స్థానంలో నిలిచారని రాజేందర్ ప్రశంసించారు.

కోవిడ్ వల్ల కుటుంబసభ్యులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది రోగులకు తోడుగా ఉంటున్నారని.. విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు పోలీసులు అన్ని విధాలుగా తోడుగా ఉంటున్నారని మంత్రి ప్రశంసించారు.

వైరస్‌కు భయపడి ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవడం సరైంది కాదని.. క్యాన్సర్, మూత్రపిండాలు, ఇతర వ్యాధులతో బాధపడేవాళ్లు తగిన చికిత్స తీసుకోవాలని రాజేందర్ సూచించారు.

ప్లాస్మా థెరపీ ఎంతో మందికి ధైర్యం ఇచ్చిందని.. కోవిడ్ ఔషధాలతో పాటు ప్లాస్మా చికిత్స ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని ఆయన అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో కరోనాతో పాటు ఇతర వ్యాధులకు చికిత్స అందించాలని ఈటల సూచించారు. 

click me!