కేసీఆర్ చేతుల్లో తెలంగాణ బందీ అయింది.. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Nov 14, 2023, 11:32 PM IST

TPCC President Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు సముచిత ప్రాతినిధ్యం ఉంటుందనీ, మహిళలకు ప్రాతినిధ్యం లేని ప్రస్తుత ప్రభుత్వానికి భిన్నంగా మహిళలకు నాలుగు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
 


Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. వివిధ రాజ‌కీయ పార్టీలు, నేత‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. గెలుపుపై ఎవ‌రికీ వారే ధీమాతో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెలాఖ‌రున జ‌రిగే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తుంద‌ని హస్తం నాయ‌కులు పేర్కొంటున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పై సొంత పార్టీ నేత‌ల‌కే న‌మ్మ‌కంలేద‌ని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో దళితులకు చోటు క‌ల్పించ‌లేక‌పోయార‌ని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో బందీగా మారిందని దుయ్యబట్టారు. 

దేశంలో కేసీఆర్ లాంటి దోపిడీదారుడు లేడంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నో ఆకాంక్ష‌ల‌తో సాధించుకున్న తెలంగాణ‌లో.. పదేళ్లుగా రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.  కాంగ్రెస్ పార్టీ మహిళలకు 12 టిక్కెట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ‌లో తాము అధికారంలోకి వ‌స్తే.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో న‌లుగురు మహిళలకు కేబినెట్‌లో స్థానం కల్పిస్తామని స్ప‌ష్టం చేశారు. మహిళా సాధికారత ఉన్న చోటే అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అండ్ కో వైన్‌ షాపులు పెట్టి పేదల ఆస్తులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సంపదను సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Latest Videos

ఈ నియోజ‌క‌వ‌ర‌గం అభివృద్దికి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు డిగ్రీ కళాశాలను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్‌ ప్రజలకు హామీ ఇచ్చారు . 100 పడకల ఆసుపత్రిని ఘన్‌పూర్‌కు తీసుకురాలేకపోవడానికి కార‌ణం ప్రభుత్వమే అంటూ దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కువగా ఉన్నాయనీ, ఈ విష‌యంలో రాష్ట్రం ఎందుకు మొదటి స్థానంలో ఉందో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఆరుగురు మహిళలకు బీఆర్‌ఎస్ టిక్కెట్లు ఇచ్చిందనీ, ఇది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నార‌నేది తెలియజేస్తోందని అన్నారు. 2014 నుంచి 2018 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి టర్మ్‌లో ఒక్క మహిళ కూడా లేరనీ, ప్రస్తుత కేబినెట్‌లో కేవలం ఇద్దరు మంత్రులకు మాత్రమే బీఆర్‌ఎస్ అవకాశం కల్పించిందని రేవంత్ విమ‌ర్శించారు.

click me!